Vizianagaram Crime News: సినిమా స్టైల్లో రూ.1.40 కోట్లు కొల్లగొట్టిన దొంగలను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23న విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో బ్యాంకు ఏటీఎంలలో నగదు పెట్టే ఏజన్సీ నుంచి రూ.1.40 కోట్లు దోచేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ దీపిక తెలిపారు. నిందితుల నుంచి రూ. 80 లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. 


ఎస్పీ దీపిక మీడియాతో మాట్లాడుతూ.. ‘సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్' అనే కంపెనీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు వంటి జాతీయ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లో నగదు పెడుతుంటారు. ఈ కంపెనీలో కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న నలుగురు ఆగస్టు 23న రూ.1.40 కోట్లు తీసుకొని, రూట్ నంబరు 3, 4 లోగల ఏటీఎం కేంద్రాల్లో జమ చేసేందుకు బయలుదేరారు. కుమిలి గ్రామంలోని ఇండియా 1 ఏటీఎం కేంద్రంలో రూ. 4 లక్షలు జమ చేసి, మిగిలిన రూ.1.36 కోట్ల నగదుకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. 


బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి ఆగస్టు 24 నుంచి 26 వరకు క్యాష్ ఆడిట్ నిర్వహించి, సుమారు రూ.1,42,27,900 నగదు పోయినట్లుగా గుర్తించి గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ‘సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ’ కంపెనీలో కస్టోడియన్స్ గా పని చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. విచారణలో 70:100 నిష్పత్తిలో రూ.2 కోట్ల రూ. 2 వేలు నోట్లు తీసుకొని, రూ.1.40 కోట్లు విలువ చేసే రూ.500ల నోట్లును వేరే వ్యక్తులకు ఇచ్చినట్లు తేలింది. వారి వద్ద నుంచి రూ.60 లక్షలు కమీషనుగా పొందాలని భావించారు. 


నిందితులు ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా ఆగస్టు 23న రెండు బ్యాగుల్లో రూ. 1.40 కోట్లతో నలుగురు నిందితులు గంట్యాడ మండలం కొర్లాంలోని ఏటీఎం వద్దకు బైక్‌లపై బయల్దేరారు. గ్రామ శివార్లలో వారిపై సాలూరు మండలం మరుపల్లికి చెందిన రాయపల్లి వినోద్, రణస్థలం మండలం బోయపాలెంకు చెందినబోయ గోవింద రావు, పార్వతీపురం పట్టణానికి చెందిన అలజంగి సాయి అలియాస్ టాట్టూ సాయి, మరడ శివశంకర్, విజయనగరం పట్టణం బాబామెట్టకు చెందిన నక్క సంతోష్ దాడి చేశారు. రూ.1.40 కోట్ల నగదును దోచుకొని పరారయ్యారు.


ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఎస్పీ దీపిక విజయనగరం రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు, సీసీఎస్ సీఐ బుచ్చిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. రూ.1.40 కోట్లను దోచుకొనిపోయిన నిందితుల గురించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి, దోపిడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.80 లక్షల నగదును, ఒక బంగారు గొలుసు, మూడు సెల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు కస్టోడిన్స్, దోపిడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. 


దోపిడీకి పాల్పడిన వారికి కొందరు నిందితులు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యిందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ దీపిక తెలిపారు. కేసులో ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. వీరందరికి త్వరలో ప్రోత్సాహక బహుమతులను అందజేస్తామన్నారు. ప్రజలు మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని, నిబంధనల మేరకు రూ.2000 నోట్లను బ్యాంకుల్లోనే మార్చుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు. నోట్ల మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.