Moinabad Drugs Party | మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారం ఎక్సైజ్ పోలీసులు ఫాం హౌస్‌లో తనిఖీలు చేశారు. రూ.2 లక్షల విలువైన డ్రగ్స్, 3 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
వీకెండ్ మత్తుతో జైలుపాలువీకెండ్ వచ్చిందంటే చాలు ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫాం హౌస్ లలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో ఈ కల్చర్ అధికం అవుతోంది. ఇటీవల సైతం గత వారం ఏపీ నుంచి కొందర్ని తీసుకొచ్చి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుంటే పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పలువుర్ని అరెస్ట్ చేశారు. తాజాగా శనివారం అర్ధరాత్రి మొయినాబాద్ లోని సెరీన్ ఆర్చర్డ్స్ ఫామ్ హౌస్ (Serene Orchards Farm House)లో బర్త్ డే పార్టీ జరిగింది. ఐటీ ఉద్యోగి బర్త్ డే పార్టీలో ఏల్ఎస్ డి బ్లాట్స్, హష్ అయిల్, మద్యంతో పార్టీ నిర్వహించారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ పై ఆకస్మిక దాడులు చేశారు.
డ్రగ్ టెస్టులో ఆరుగురికి పాజిటివ్..
పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ గా వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీలత తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నగరానికి డ్రగ్స్ తీసుకు వచ్చి మొయినాబాద్ ఫాం హౌస్‌లో పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారంతో ఆకస్మిక దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ బర్త్ డే పార్టీలో ఏల్ఎస్ డి బ్లాట్స్, హష్ ఆయిల్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫాం హౌస్ నిర్వాహకుడిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. బర్త్ డే పార్టీ కోసం అభిజిత్ అనే వ్యక్తి ఫాం హౌస్‌ను బుక్ చేసినట్లు గుర్తించారు.