Encounter at Chhattisgarh- Gadchiroli border | గడ్చిరోలి: మహారాష్ట్రలో తుపాకుల మోత మోగింది. గడ్చిరోలిలో బుధవారం నుంచి జరుగుతున్న భారీ ఎన్‌కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు కాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని వండోలి గ్రామం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలిక సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి, వారి దాడుల్ని తిప్పి కొట్టారు.


గడ్చిరోలి పోలీసులు, సీ60 కమాండోలు ఈ భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఛత్తీస్ గఢ్, గడ్చిరోలి సరిహద్దుల్లో (Chhattisgarh- Gadchiroli border) లోని కాంకేర్ సమీపంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు, కమాండోలు రంగంలోకి దిగారు. డిప్యూటీ ఎస్పీ ఈ సెర్చ్ ఆపరేషన్‌కు నేతృత్వం వహించగా.. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు మావోయిస్టులు పరారయ్యారని, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించనున్నారు. 






ఈ కాల్పుల్లో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, జవాన్ గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆటోమెటిక్ మేషిన్ గన్స్, మరిన్ని ఇతర ఆయుధాలను టీమ్స్ స్వాధీనం చేసుకున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి మావోయిస్టులపై ఆపరేషన్ నిర్వహించిన గడ్చిరోలి పోలీసులకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.51 లక్షలు నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆ మృతదేహాలు ఎవరివి అనే గుర్తించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపిన పోలీసుల ధైర్య సాహసాలను ప్రభుత్వం ప్రశంసించింది.