Kanpur News: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని కాన్పూర్ జిల్లాలోని సాచెండి(Sachendi ) ప్రాంతంలో 10 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్విన దొంగలు బ్యాంక్‌లో చోరీకి పాల్పడ్డారు. బ్యాంక్ గోల్డ్‌ చెస్ట్ పగులగొట్టి కోటి రూపాయల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


స్ట్రాంగ్ రూమ్‌లోకి చొరబడిన దొంగలు రూ.32 లక్షల నగదు చెస్ట్ పగలగొట్టలేకపోయారని డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయ్ ధల్ తెలిపారు. బంగారం, నగదు చెస్ట్‌లు రెండూ ఒకే చోట ఉండటం వల్ల వాళ్లకు చోరీ మరింత ఈజీ అయిందని అంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి చోరీ అయిన బంగారం గురించి అంచనా వేయడానికి బ్యాంకు అధికారులకు గంటల సమయం పట్టింది. చివరకు 1.8 కిలోల బంగారం చోరీకి గురి అయినట్టు తెలిపారు. దీని విలువ సుమారు కోటి రూపాయలు అని పేర్కొన్నారు.


బ్యాంకు దోపిడీపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులకు బ్యాంకు సమీపంలో ఓ పెద్ద సొరంగం కనిపించింది. బ్యాంక్ సమీపంలోని ఖాళీ స్థలంలో దీన్ని కనుగొన్నారు. సుమారు నాలుగు అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు ఉంటుందీ సొరంగం. ఈ సొరంగం ద్వారానే దొంగలు బ్యాంకు లోపలికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. 


అచ్చం మనీహెయిస్ట్‌ వెబ్‌సిరీస్‌లో చోరీ చేసినట్టుగానే ఈ చోరీ జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్ మాత్రమే ఇలాంటివి చేయగలరని... వాళ్లకు బ్యాంకు గురింతి బాగా తెలిసినవాళ్లు సాయం చేసి ఉంటారని సందేహాలు వస్తున్నాయి. దొంగలు ఈ ప్రాంతంలో కొన్ని రోజులు రెక్కీ చేశారని తెలిపారు. బ్యాంకు నిర్మాణం, ప్లానింగ్‌, స్ట్రాంగ్ రూమ్, నగదు, బంగారం చెస్ట్‌ ఎక్కడ ఉన్నాయనే విషయం తెలుసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అన్నీ పక్కాగా చెక్‌ చేసుకున్న తర్వాత చోరీకి స్కెచ్‌ వేశారు. 






శుక్రవారం ఉదయం బ్యాంకు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బంగారు చెస్ట్‌, స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే విషయం అర్థమై పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు స్ట్రాంగ్ రూమ్ లోకి ప్రవేశించిన సొరంగాన్ని కూడా బ్యాంకు అధికారులు చూశారు. సమాచారం అందుకున్న సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్లతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.