Zomato New Service Pure Veg Mode And Fleet: ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని ఆహారాన్ని ఇంటి గుమ్మం వద్దకు తీసుకెళ్లి అందించే జొమాటో, 'ప్యూర్ వెజ్ మోడ్‌ అండ్‌ ఫ్లీట్‌' పేరిట మరో కొత్త సేవను ప్రారంభించింది. వెజ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక సర్వీస్‌ ఇది. స్వచ్ఛమైన శాఖాహారులు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. కంపెనీ వ్యవస్థాపకుడు & CEO దీపిందర్ గోయల్, 'ప్యూర్ వెజ్ మోడ్‌ అండ్‌ ఫ్లీట్‌'ను ప్రారంభిస్తున్నట్లు మంగళవారం (19 మార్చి 2024)  ప్రకటించారు.


మన దేశంలో స్వచ్ఛమైన శాఖాహారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆర్డర్‌ చేసిన ఆహారాన్ని మాంసాహార ప్యాకెట్లతో కలిపి తెచ్చినా వాళ్లకు నచ్చదు. ఆహారాన్ని వండడం దగ్గర నుంచి హోమ్‌ డెలివెరీ వరకు శుద్ధమైన పద్ధతిలో జరగాలని శాఖాహారులు కోరుకుంటారు. అలాంటి వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా సేవలు అందించేందుకు జొమాటో 'ప్యూర్ వెజ్ మోడ్‌ అండ్‌ ఫ్లీట్‌' రూపుదిద్దుకుంది. ఈ సర్వీస్‌ను ఎంపిక చేసుకున్న కస్టమర్లు.. కేవలం శాకాహారం మాత్రమే అందించే హోటళ్లు, రెస్టారెంట్‌లు యాప్‌లో కనిపిస్తాయి, మాంసాహార ఆహారాన్ని అందించే హోటళ్లు, రెస్టారెంట్లు కనిపించవు. 


కొత్త సర్వీస్‌ గురించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో దీపిందర్ గోయల్ పోస్ట్ చేశారు. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులు భారతదేశంలో ఉన్నారని రాశారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త సేవను ప్రారంభించినట్లు వెల్లడించారు. జొమాటో వెజ్ కస్టమర్ల కోసం 'ప్యూర్ వెజ్ మోడ్‌ అండ్‌ ఫ్లీట్‌' సిబ్బంది ఎరుపు రంగు దుస్తులు, ఎరుపు రంగు బాక్స్‌లకు బదులుగా పచ్చరంగు దుస్తులు, పచ్చ రంగు బాక్స్‌లు ఉపయోగిస్తామని ప్రకటించారు.


శాఖాహారాన్ని ఆర్డర్‌ చేసే కస్టమర్లు, ఆ ఆహారాన్ని ఎలా వండుతారు & దానిని ఏ పద్ధతిలో డెలివరీ చేస్తారనే విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారని దీపిందర్‌ గోయల్‌ ఎక్స్‌లో రాశారు. వెజ్‌ కస్టమర్ల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని తాము శాఖాహార సేవను 'ప్యూర్ వెజ్ మోడ్‌'తో ప్రారంభించబోతున్నట్లు వివరించారు. కొత్త సర్వీస్‌పై ఎలాంటి విమర్శలు రాకుండా.. మతపరమైన లేదా రాజకీయ ప్రాధాన్యత కోసం ఇలా చేయలేదని వ్యాఖ్యానించారు.










మరో ఆసక్తికర కథనం: పట్టు వదలని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి