భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో తన ట్రేడింగ్ ప్రస్థానాన్ని ఆరంభించిన జొమాటో (zomato) మొత్తానికి ఛాంపియన్ అనిపించుకుంది. లక్షల మంది మదుపర్ల ఆశల్ని కూడగట్టుకొని భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలి యూనికార్న్‌గా చరిత్ర సృష్టించింది. గత కొన్ని నెలలుగా ఊరించిన జొమాటో (zomato) ఐపీఓ.. అందరూ ఊహించినట్లుగానే మదుపర్లకు తొలిరోజు మంచి రుచి చూపించింది. మదుపర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు.
ట్రేడింగ్ సాగిందిలా...
ఐపీఓ ధర రూ.76కు 51.32 శాతం ప్రీమియంతో బీఎస్‌ఈలో రూ.115 వద్ద.. ఎన్‌ఎస్‌ఈలో 52.63 శాతం ప్రీమియంతో రూ.116 వద్ద జొమాటో (zomato) ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టింది. 10:08 గంటల సమయంలో 82.17 శాతం ప్రీమియంతో రూ.138.90 వద్ద జొమాటో (zomato) షేరు ధర అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లు దాటి రూ.1,08,067.35కు చేరింది. అప్పర్ సర్క్యూట్ వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో కొద్దిసేపటికి 115 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. ఆపై ట్రేడింగ్ ముగిసే వరకు షేరు 120-130 మధ్య స్థిరంగా కదలాడింది. చివరకు 65.79 శాతం లాభంతో 126 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ రూ.98 వేల కోట్లకు చేరింది. ఇలా ఈరోజు జొమాటో (zomato) షేరు.. రూ.115-138.90 మధ్య కదలాడింది.
విశిష్టతలు..
లిస్టింగ్‌లో 50 శాతానికి పైగా ప్రీమియం సాధించిన అతికొద్ది కంపెనీల సరసన జొమాటో (zomato) చేరింది. అలాగే జొమాటోలాగే తొలిరోజే రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించిన కంపెనీలు కూడా చాలా తక్కువ. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా బీఎస్‌ఈలో టాప్ 50 జాబితాలో జొమాటో (zomato) చేరింది. ప్రముఖ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్‌ను సైతం వెనక్కి నెట్టింది.
అంచనాలను మించి..
వాస్తవానికి విశ్లేషకులు జొమాటో షేరు 27-30 శాతం ప్రీమియంతో లిస్టవుతుందని అంచనా వేశారు. కానీ, అలాంటి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మరోవైపు జొమాటో (zomato) విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.. కానీ, వాటన్నింటినీ అధిగమించి జొమాటో (zomato) షేరు తొలిరోజు.... తన ప్రస్థానాన్ని సాగించింది. భారత్‌లో కన్జ్యూమర్ టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో వాటాల కోసం ఏ స్థాయిలో డిమాండ్ ఉందో జొమాటో లిస్టింగ్ నిరూపించింది. మరికొన్ని రోజుల్లో పేటీఎం, పాలసీబజార్, మొబిక్విక్, ఫ్లిప్‌కార్ట్, నైకా వంటి ఐపీఓలకు మంచి మార్కెట్‌ను సృష్టించి పెట్టింది.
ALSO READ:
RBI SALARIES: సెలవు రోజుల్లో కూడా జీతాలు, పింఛన్ డబ్బులు... ఆర్బీఐ శుభవార్త
PPF Investment: ప్రతి నెలా రూ.2 వేలతో 50 లక్షలు పొందండి ఇలా..!