UPI Payments in Dollars: 'డిజిటల్‌ ఇండియా' ఇనీషియేటివ్‌లో భాగంగా తీసుకొచ్చిన UPI (Unified Payments Interface), మన దేశంలో చెల్లింపుల విషయంలో ఎలాంటి విప్లవం తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. మంచినీళ్లు దొరకని మారుమూల పల్లెలకు కూడా యూపీఐ వెళ్లింది. చదువు రాని వ్యక్తులు సైతం యూపీఐతో ఈజీగా పేమెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు... సెలవులు, బంద్‌లతో సంబంధం లేకుండా ఇది 24X7 పని చేస్తుంది. పూర్తిగా యూజర్‌ ఫ్రెండ్లీ కాబట్టి, ప్రజల రోజువారీ అలవాట్లలో UPI ఒక భాగమైంది. 


అద్భుతమైన అప్‌డేషన్‌ కోసం సిద్ధం
ఇప్పటి వరకు, యూపీఐ ద్వారా మనం రూపాయిల్లో లావాదేవీలు నిర్వహించాం. ఇకపై, డాలర్ల రూపంలోనూ (UPI payments in Dollars) చెల్లింపులు చేసేలా మార్పులు తీసుకురాబోతున్నారు. CNBC ఆవాజ్ రిపోర్ట్‌ ప్రకారం... ఒక్క డాలర్లలోనే కాదు, యూపీఐతో ఒప్పందం ఉన్న దేశాల్లోని వ్యక్తులు/సంస్థలకు ఆయా దేశాల కరెన్సీల్లోనే డబ్బులు పంపొచ్చు. దీనివల్ల ప్రపంచ సరిహద్దులు చెరిగిపోయి, అవాంతరాలు లేని లావాదేవీలకు తలుపులు తెరుచుకుంటాయి. 


యూపీఐని ఉపయోగించి డాలర్ల రూపంలో డబ్బులు పంపడానికి, పేమెంట్స్‌ సిస్టమ్‌లో టెక్నికల్‌గా కొన్ని మార్పులు చేయాలి. ఇప్పుడు అదే పని జరుగుతోంది. దీంతోపాటు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కలిసి స్విఫ్ట్‌తో (SWIFT) చర్చలు జరుపుతున్నాయి. స్విఫ్ట్‌తో చర్చలు పూర్తి కావడమే దీనిలో కీలక ఘట్టం.


అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చెల్లింపుల వ్యవస్థ సిఫ్ట్‌ (Society for Worldwide Interbank Financial Telecommunication). సీమాంతర (దేశాల మధ్య) లావాదేవీలకు ఇది థర్డ్‌ పార్టీగా పని చేస్తుంది. యూపీఐని స్విఫ్ట్‌తో అనుసంధానిస్తే, క్రాస్-బోర్డర్ డిజిటల్ లావాదేవీల్లో (cross-border digital transactions) యూపీఐ అత్యంత అనుకూలంగా, సురక్షితంగా మారుతుంది. రూపాయలను పంపినట్లే డాలర్లు, ఇతర కరెన్సీలను కూడా చిటికె వేసినంత సులభంగా పంపొచ్చు.


NPCI జారీ చేసిన తాజా డేటా ప్రకారం, గత నెలలో (నవంబర్ 2023) యూపీఐ లావాదేవీలు 11.24 బిలియన్లకు చేరుకున్నాయి. లావాదేవీల మొత్తం విలువ రూ.17.40 లక్షల కోట్లకు చేరుకుంది.


యూపీఐ పేమెంట్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన ఆర్‌బీఐ
ఈ నెల 8న పాలసీ నిర్ణయాలు ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das), ప్రజలకు ఉపయోగపడేలా యూపీఐ చెల్లింపుల స్థాయిని పెంచారు. ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో UPI చెల్లింపుల పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది. 


దీంతోపాటు, ఆటో-డెబిట్‌గా అందరూ పిలిచే ఈ-మాండేట్ (e-mandate) పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ.15,000 నుంచి రూ.1 లక్షకు RBI పెంచింది. ఇప్పటి వరకు, రూ.15,000 కంటే ఎక్కువ ఉన్న UPI ఆటో డెబిట్స్‌ కోసం OTP ఎంటర్‌ చేయాలి. ఈ అప్‌డేషన్‌తో, ₹1 లక్ష వరకు లావాదేవీలకు OTP తప్పనిసరి కాదు. క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులు, SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌ కొనడం, బీమా ప్రీమియంలను మిస్‌ కాకుండా చెల్లించడానికి ఈ నిర్ణయం చాలా బాగా ఉపయోగపడుతుంది.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కొనడానికి కరెక్ట్‌ టైమ్‌ ఇదేనా? - రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి