Uday Kotak:


భారత అండర్‌ రైటింగ్‌, కెపాసిటీ బిల్డింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని కొటక్‌ మహీంద్రా బ్యాంకు సీఈవో ఉదయ్‌ కొటక్‌ అన్నారు. వ్యవస్థ పరంగా దేశానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. అదానీ-హిండెన్‌వర్గ్‌ వివాదంపై ఆయన పరోక్షంగా స్పందించారు. అదానీ పేరు ప్రస్తావించకుండానే ఆయన మాట్లాడటం గమనార్హం.


'ఈ మధ్య చోటు చేసుకున్న ఘటనలతో భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పేమీ కనిపించడం లేదు. ఏదేమైనా భారీ పారిశ్రామికవేత్తలు అప్పులు, ఈక్విటీ వనరుల కోసం అంతర్జాతీయ సంస్థలపై ఆధారపడుతున్నారు. ఇదే మనకు మరింత సవాల్‌గా మారుతోంది. భారత అండర్‌రైటింగ్‌, కెపాసిటీ బిల్డింగ్‌ను మరింత పటిష్ఠం చేయాల్సిన సమయమిదే' అని ఉదయ్‌ కొటక్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం ఇలాగే స్పందించడం గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థ, ప్రత్యేకించి బ్యాంకులకు నష్టభయం తక్కువేనని సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్ ఇండియా (సెబీ), రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) చెప్పినట్లు వివరించారు. అయితే భారత పాలక వ్యవస్థలు, కంపెనీలపై విదేశీ పెట్టుబడిదారులు, రుణదాతలు నమ్మకం కోల్పోతే కష్టమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


అదానీ గ్రూప్‌ కంపెనీలకు 2022, మార్చి నాటికి రూ.1.88 లక్షల కోట్ల స్థూల రుణాలు ఉన్నాయి. చేతిలో ఉన్న నగదును పరిగణనలోకి తీసుకుంటే రూ.1.61 లక్షల కోట్లు నికర అప్పులుగా తేలాయి. ఇందులో రూ.70 వేల కోట్ల వరకు భారత బ్యాంకుల నుంచి సేకరించారని తెలిసింది. మిగిలినవి విదేశీ బ్యాంకులు, పెట్టుబడిదారులు సమకూర్చారు. 


అదానీకి జరిగిన నష్టం ఎంత?


భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న అదానీ గ్రూప్‌ మీద అమెరికన్ షార్ట్ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పాతాళానికి పడిపోయాయి. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ స్టాక్స్‌ విలువ 100 బిలియన్లకు పైగా క్షీణించింది, దాదాపు సగం ఆవిరైంది. ఈ పతనం, గౌతమ్‌ అదానీని ప్రపంచ సంపన్నుల జాబితాలోని 3 స్థానం నుంచి అతి దూరంగా నెట్టేసింది. ప్రస్తుతం, సంపన్నుల జాబితాలో 22వ స్థానంలో గౌతమ్‌ అదానీ ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించినప్పటికీ అదానీ గ్రూప్ షేర్లలో పతనం, గౌతమ్ అదానీ నికర విలువ క్షీణత ఆగలేదు. 


ఫిచ్‌ రేటింగ్స్‌ ఇవి


ఫిచ్ రేటింగ్స్, ప్రస్తుతం అదానీ గ్రూప్‌లోని 8 కంపెనీలకు రేటింగ్ ఇచ్చింది. ఇందులో అదానీ ట్రాన్స్‌మిషన్‌ BBB-/ Stable పొందింది. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌ జారీ చేసిన సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB- రేటింగ్ పొందాయి. అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB-/ Stable రేటింగ్‌, అదానీ ట్రాన్స్‌మిషన్ BBB-/ Stable రేటింగ్‌, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB-/Stable రేటింగ్‌, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ బాండ్స్‌కు BBB-/ Stable రేటింగ్‌ను ఫిచ్‌ ఇచ్చింది.


దీనికి ముందు, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (CRISIL) కూడా ఒక ప్రకటన చేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన అన్ని రేటింగ్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. 'abp దేశం' ఎవరికీ వత్తాసు పలకడం లేదు, ఎవరి పక్షాన వకాల్తా పుచ్చుకోవడం లేదని పాఠకులు గమనించాలి. అంతేకాదు, మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' సిఫార్సు చేయడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.