2025 సంవత్సరం నేటితో ముగియనుంది. పన్నులకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని పూర్తి చేయడానికి కూడా ఈరోజు వరకు అవకాశం ఉంది. మీ పాన్ కార్డ్ (PAN) ఇంకా ఆధార్‌తో లింక్ చేయకపోతే, మీరు ఈ విషయం తెలుసుకోండి. మీ ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయకపోతే జనవరి 1 నుంచి మీకు ఎటువంటి ఉపశమనం లభించదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కనుక ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయని వారు డిసెంబర్ 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా ఆధార్, పాన్ కార్డ్‌ను లింక్ చేయని వారికి కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి అనేక ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఏ విషయాల్లో మీకు ఇబ్బందులు కలుగుతాయో ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆధార్-పాన్ లింక్ చేయడం ఎందుకు ముఖ్యం?
పన్ను (Income Tax) వ్యవస్థను పారదర్శకంగా మార్చడమే పాన్, ఆధార్‌ను లింక్ చేయడం ఉద్దేశ్యం. ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పన్నులకు సంబంధించిన మోసాలను నివారించవచ్చు. గత కొంతకాలంగా ఈ గడువును కేంద్రం చాలాసార్లు పొడిగించింది. ఇప్పుడు మాత్రం డిసెంబర్ 31 వరకు చివరి అవకాశంగా చెప్పింది. కనుక భారత పన్ను చెల్లింపుదారులకు పాన్-ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. ఉద్యోగులు, వ్యాపారస్తులు, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే వారందరూ ఈ పని చేయాలి. అయితే, NRIలు లేదా నిర్దిష్ట వయస్సు గలవారు వంటి కొన్ని ప్రత్యేక వర్గాలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ సాధారణ ప్రజలకు ఈ రూల్ వర్తిస్తుంది.
డిసెంబర్ 31 లోపు ఆధార్‌తో లింక్ చేయకపోతే ఏమవుతుంది?
- మీరు డిసెంబర్ 31 లోపు పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయకపోతే జనవరి 1 నుండి మీ పాన్ ఎందుకు పనికిరాకుండా పోతుంది. పాన్ నంబర్ పూర్తిగా రద్దు చేయరు. కానీ దానిని మీరు ఉపయోగించలేరు.
- డిసెంబర్ 31 లోపు ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే, మీరు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లను దాఖలు చేయలేరు.
- మీకు ఐటీఆర్ రీఫండ్ రావలసి ఉంటే, అది కూడా నిలిచిపోవచ్చు.
- వడ్డీ, డివిడెండ్ లేదా ఇతర ఆదాయాలపై ఎక్కువ పన్ను కట్ అవుతుంది
- కొత్త బ్యాంక్ ఖాతా తెరవడం, KYC పూర్తి చేయడం, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడం వీలు కాదు.
- లోన్స్ లేదా ఇతర ఆర్థిక పరమైన సేవల్లో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.
- సీనియర్ సిటిజన్‌లకు లభించే ఫారం 15G లేదా 15H ప్రయోజనం కూడా నిలిపివేసే అవకాశం ఉంది
పాన్ కార్డ్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
- ఆన్‌లైన్‌లో పాన్, ఆధార్‌ను లింక్ చేయడం పూర్తిగా సులభం.
- పాన్, ఆధార్‌ను లింక్ చేయడానికి ముందుగా మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ కి వెళ్లాలి.
- ఆ తర్వాత, క్విక్ లింక్‌లో Link Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది.
- Link Aadhaar ఎంపికకు వెళ్ళిన తర్వాత, పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, OTP ద్వారా వెరిఫై చేసుకోవాలి.
- ఇప్పుడు మీరు e pay tax ద్వారా నిర్ణీత రుసుమును చెల్లించాలి.
- చెల్లించిన తర్వాత పోర్టల్‌కి వెళ్లి ఆధార్ నెంబర్, పాన్‌ను లింక్ చేయవచ్చు.
- పాన్, ఆధార్ కార్డ్‌లు లింక్ అయిన తర్వాత, మీరు ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోని లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ ద్వారా లింక్ స్టేటస్‌ను కూడా చెక్ చేయవచ్చు.