Cyclone Dana Effect: బంగాళాఖాతంలో దానా తుపాను వేగంగా కదులుతోంది. ఇది, గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే.. దానా తుపాను ప్రభావం ఒడిశా మీద చాలా ఎక్కువగా, పశ్చిమ బెంగాల్‌ మీద ఎక్కువగా, ఆంధ్రప్రదేశ్‌ మీద తక్కువగా ఉండొచ్చు. తుపాను గమనం, ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ (IMD) ఈ మూడు రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తోంది. తుపాను నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు ఈ మూడు ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాయి.  


కూరగాయల ధరలకు రెక్కలు
దానా తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ఒడిశాలోని తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు, అక్కడి మార్కెట్లలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రజలు ఎక్కువ రోజులకు సరిపోయే కూరగాయలు కొని నిల్వ చేసుకోవడానికి మార్కెట్లకు పోటెత్తారు. డిమాండ్‌ పెరగడంతో ఒడిశా లోకల్‌ మార్కెట్‌లలో టమాటాలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు సహా అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి. మంగళవారం ఒక్క రోజే, కటక్‌లో బంగాళదుంప ధర కిలో రూ.30 నుంచి రూ.50కి పెరిగింది. ఒడిశాలోని అతి పెద్ద కూరగాయల మార్కెట్‌లో ఉల్లిపాయల ధర కిలోకు రూ.40 నుంచి రూ.60కి పెరిగింది.


భువనేశ్వర్‌లోని కూరగాయల మార్కెట్‌లలో ప్రస్తుతం టమాటా కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. బీన్స్, దొండకాయ, బెండకాయ, క్యాలీఫ్లవర్ వంటి ఇతర కూరగాయల ధరలు కూడా ఒక్కో కిలోకు రూ.20 వరకు పెరిగాయి. కూరగాయలతో పాటు కిరాణా సరుకుల కోసం కూడా ప్రజలు క్యూ కడుతున్నారు. లోకల్‌ షాపులతో పాటు పెద్ద మాల్స్‌లోనూ రద్దీ పెరిగింది. తుపాను ముందు పరిస్థితే కాదు, తుపాను తర్వాతి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు జరుగుతున్నాయి.


ప్రజల్లో తీవ్ర ఆందోళన
"రాష్ట్రాన్ని తుపాను తాకిన తర్వాత మార్కెట్‌ పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదు. సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే ధరలు మరింత పెరగొచ్చు. కాబట్టి, మా కుటుంబానికి కొన్ని రోజుల పాటు సరిపోయే కూరగాయలను, సరుకులను ముందే కొంటున్నాం" అని ప్రజలు చెబుతున్నారు.


తుపాను అల్లకల్లోలం సృష్టిస్తే రోడ్లు కోతకు గురి కావచ్చు. కొండ చరియలు, మట్టి పెళ్లలు రోడ్లపై విరిగి పడొచ్చు. వంతెనలు కొట్టుకుపోవచ్చు. రోడ్లపై చెట్లు, కరెంటు స్తంభాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాలు ముంపునకు గురికావచ్చు. పైగా, కూరగాయలను రవాణా చేసే ట్రక్కుల కొరత కూడా ఉంటుంది. ఇన్ని రకాల ఆందోళనలు ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.


రైళ్లు రద్దు
గురువారం ఉదయం తీవ్ర తుపానుగా మారనున్న దానా, శుక్రవారం ఉదయానికి ఒడిశాలోని పూరీ - పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్‌ మధ్య తీరం దాటొచ్చని IMD అంచనా వేసింది. తుపాను నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడిచే చాలా రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య నడిచే వందేభారత్‌ ట్రైన్‌ను గురువారం (అక్టోబర్‌ 24) రద్దు చేశారు.


మరో ఆసక్తికర కథనం: ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ అలర్ట్‌- ఆ సంస్థ ఛైర్మన్‌ ఫోన్‌కాల్ చేసి డబ్బులు అడగొచ్చు