వాషింగ్టన్: అమెరికా న్యాయ విభాగం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న క్రిమినల్ కేసులన్నింటినీ శాశ్వతంగా ఉపసంహరించుకుంది. దీనితో న్యూయార్క్‌లో జరుగుతున్న వివాదాస్పద సెక్యూరిటీస్ అండ్ చీటింగ్ కేసు పూర్తిగా ముగిసింది. తమ వద్ద అందుకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు చెప్పిన తరువాత ఈ నిర్ణయం వెలువడింది. అదానీపై ఆరోపణలను ఇకపై కొనసాగించలేమని అమెరికా ప్రాసిక్యూటర్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా అమెరికాలో అదానీ గ్రూప్‌నకు సంబంధించిన అన్ని కేసులు విత్ డ్రా చేసుకున్నట్లు అయింది. ఈ కేసును సమీక్షించిన తర్వాత, తమ 'ప్రాసిక్యూషన్ విచక్షణ' ప్రకారం, ఈ క్రిమినల్ ఆరోపణలపై ఇకపై వనరులను వినియోగించరాదని నిర్ణయించుకున్నామని అమెరికా ప్రాసిక్యూటర్లు ఈస్ట్ న్యూయార్క్ కోర్టులో తెలిపారు. గత వారం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అదానీ, అదానీ గ్రూపుపై సివిల్ కేసులు విత్‌డ్రా చేసుకోవడం తెలిసిందే.
గౌతమ్ అదానీపై ఆరోపణల ఉపసంహరణ
భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీపై ఆరోపణలను శాశ్వతంగా కొట్టివేయాలని కోర్టు ఆదేశించింది. అంటే ఈ కేసును మళ్లీ ఓపెన్ చేయడానికి ఇక వీలుండదు. గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్‌నకు సంబంధించిన అనేక అమెరికా నియంత్రణ, చట్టపరమైన కేసులు మూసివేసిన సమయంలో అమెరికా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
గత వారం యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడిదారుల వెల్లడి కేసును క్లోజ్ చేసింది. ఈ కేసులో ఎటువంటి తప్పును అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండా గౌతమ్ అదానీ 60 లక్షల డాలర్లు, సాగర్ అదానీ 120 లక్షల డాలర్లు చెల్లించడానికి అంగీకరించారు.
అనంతరం అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) కూడా ఇరాన్‌కు సంబంధించిన ఆంక్షల ఉల్లంఘన కేసులో అదానీ గ్రూప్‌తో 27.5 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఇరాన్ LPG దిగుమతి కేసులో విస్తృత సహకారం, స్వచ్ఛంద వెల్లడి ఆధారంగా ఈ ఒప్పందం కుదిరింది. తాజాగా అమెరికా న్యాయ విభాగం కూడా అదానీ, ఆయన మేనల్లుడిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తొలగించింది. దాంతో హైప్రొఫైల్ సెక్యూరిటీ, వైర్ ఫ్రాడ్ కేసు అధికారికంగా ముగిసింది.
అమెరికా కోర్టులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం, సమీక్షించిన తర్వాత అదానీపై ఆరోపణలను కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అమెరికా కోర్టు కేసును కొట్టివేస్తూ శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించింది. అయితే, అమెరికా క్రిమినల్ విధానాలలో ఇలాంటి నిర్ణయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సాధారణంగా విస్తృత సమీక్ష తర్వాత మాత్రమే ఇలాంటి తీర్పు వస్తుంది.
నివేదికల ప్రకారం, దర్యాప్తు సమయంలో ఆరోపణలను కొనసాగించడానికి తగినన్ని ఆధారాలు ప్రాసిక్యూటర్లకు లభించలేదు. ఈ కేసు 2024 ఏడాది చివరి రోజుల్లో దాఖలైంది. అదానీ గ్రూప్ భారత అధికారులకు సంబంధించిన 26.5 కోట్ల డాలర్ల లంచం కేసును దాచిపెట్టి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడి సేకరించిందనేది ప్రధాన ఆరోపణ.
కేసులను ముగించిన అమెరికా న్యాయ విభాగం
అమెరికా ప్రాసిక్యూటర్లు, అదానీ గ్రూప్ ఏర్పాటు చేసిన లాయర్ల టీమ్ మధ్య నెలల తరబడి జరిగిన చర్చల తర్వాత కేసులు విత్‌డ్రా చేసుకున్నారు. న్యాయ సలహాదారులు అమెరికా అధికారుల ముందు పలు విషయాలను సమర్పించారు. ఈ సమీక్షలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై ఆరోపణలను కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని తేలింది. దాంతో అమెరికా న్యాయ విభాగం కేసును ముగించే ప్రయత్నం చేసింది.
ఏప్రిల్ 7, 2026న అమెరికా కోర్టులో దాఖలు చేసిన పత్రాలలో, అదానీ లాయర్లు SEC చర్యలను సవాలు చేస్తూ, వారికి అవసరమైన అధికార పరిధి లేదని, ఎలాంటి స్పష్టమైన తప్పుడు ప్రకటనలను నిరూపించలేదని,చ ఏ ప్రతివాదిని బాండ్ల జారీకి అనుసంధానం చేయలేదని కోర్టులో పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీస్ అండ్ వైర్ మోసానికి సంబంధించిన నిబంధనల ప్రకారం మాత్రమే ఆరోపణలు వచ్చాయి. అయితే మరింత తీవ్రమైన విదేశీ అవినీతి నిరోధక చట్టం (FCPA) కింద లంచం, ఇతర ఆరోపణలలో చేర్చలేదు.
