Digital Payments: డిజిటల్‌ రూపంలో జరిగిన నగదు లావాదేవీల విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఇండియా డిజిటల్ పేమెంట్స్‌ వార్షిక నివేదిక (India Digital Payments Annual Report 2022) ప్రకారం, 2022లో, భారతదేశంలో యూపీఐ, డెబిట్ & క్రెడిట్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ద్వారా మొత్తం రూ. 149.5 లక్షల కోట్ల విలువైన 87.92 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. 


ఆ నివేదిక ప్రకారం, కేవలం UPI (Unified Payments Interface) ద్వారానే 74.05 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి, వాటి విలువ 126 లక్షల కోట్ల రూపాయలు.


2022 సంవత్సరం డేటా ప్రకారం, 2021తో పోలిస్తే డిజిటల్‌ లావాదేవీలు ఏకంగా 91 శాతం పెరిగాయి, వాటి విలువ 76 శాతం పెరిగింది. ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా భారతదేశం డిజిటల్ చెల్లింపులలో రికార్డు పెరుగుదలను నమోదు చేస్తుందని అంచనా వేశారు. అయితే, భారతదేశం కంటే ఎక్కువ డిజిటల్ చెల్లింపులు చేసే దేశం ఇంతకుముందు ఒకటి ఉంది.


భారత్‌ కంటే ముందు అగ్రస్థానంలో ఉన్న దేశం ఇదే..      
డిజిటల్ చెల్లింపుల విషయంలో చైనా ఒకప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండేది. 2010లో, చైనా డిజిటల్ చెల్లింపులు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ ఏడాది డ్రాగన్‌ కంట్రీ డిజిటల్ లావాదేవీలు 1119 మిలియన్లు. అప్పుడు కేవలం 370 మిలియన్ల లావాదేవీలతో భారతదేశం రెండో స్థానంలో ఉంది. 153 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో అమెరికా మూడో స్థానంలో ఉంది.


భారతదేశం మొదటి స్థానంలోకి ఎలా వచ్చింది?     
2010 నుంచి భారత్‌లో సీన్‌ మారిపోయింది. భారతదేశం డిజిటల్ చెల్లింపుల విషయంలో వేగంగా దూసుకుపోతోంది. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వేగం ఇంకా పెరిగింది. చైనా గ్రాఫ్ క్షీణించడంతో, 2023 నాటికి, భారతదేశం డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరంగా 61 వేల మిలియన్ల స్థాయిని దాటింది. ఇప్పుడు చైనా డిజిటల్ లావాదేవీల పరిమాణం 22 వేల మిలియన్లకు పైన ఉంది. కేవలం 4,761 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో అమెరికా ఇప్పటికీ మూడో స్థానంలోనే ఉంది.


అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరిగిన నగరాలు        
2022 సంవత్సరంలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరిగిన భారతీయ నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 2022లో, ఆ నగరంలో రూ. 6,500 కోట్ల విలువైన 29 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. రెండో స్థానంలో దేశ రాజకీయ రాజధాని దిల్లీ ఉంది. ఆ నగరంలో రూ. 5,000 కోట్ల విలువైన 19.6 మిలియన్ లావాదేవీలు జరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడో స్థానంలో ఉంది. ఆ నగరంలో రూ. 4,950 కోట్ల విలువైన 18.7 మిలియన్ లావాదేవీలు జరిగాయి.


ఇటీవల, దేశవ్యాప్తంగా చేపట్టిన పాన్-ఇండియా డిజిటల్ పేమెంట్స్‌ సర్వేలో (90,000 మంది పాల్గొన్నారు) 42 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆర్‌బీఐ వివరించింది. 2017 జనవరిలో 45 లక్షల UPI లావాదేవీలు జరగ్గా, 2023 జనవరిలో ఈ సంఖ్య 804 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ (shaktikant das) తెలిపారు. ఇదే కాలంలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 1,700 కోట్ల నుంచి రూ. 12.98 లక్షల కోట్లకు పెరిగింది.