Rs 10 lakh Insurance Coverage In Train Accidents: టెక్నాలజీ ఎంత పెరిగినా మన దేశంలో రైలు ప్రమాదాలు ఆగడం లేదు. ఆ ప్రమాదాల్లో కొందరు చనిపోతున్నారు, కొందరు కీలక అవయవాలు కోల్పోతున్నారు. వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటే, ఇలాంటి ప్రమాదాల సమయంలో ఇన్సూరెన్స్‌ డబ్బు వస్తుంది. ఒకవేళ, వ్యక్తిగత ప్రయాణ బీమా లేకపోతే... IRCTC నుంచి కొనే ఇ-టికెట్‌పై ఐచ్ఛికంగా బీమా పాలసీ తీసుకోవచ్చు. 

ఇ-టికెట్‌ బుకింగ్‌ సమయంలో, కేవలం 45 పైసల ఖర్చుకే ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ లభిస్తుంది. రైలు ప్రమాదంలో మరణం, అంగవైకల్యం, ఆసుపత్రిలో చేరడం వంటి కేసుల్లో రూ.10 లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతుంది. 

IRCTC ప్రయాణ బీమా ప్రయోజనాలను ఎప్పుడు క్లెయిమ్ చేయవచ్చు?

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు బాధితులకు లేదా బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ ప్రయోజనం అందుతుంది.

రైలు ప్రమాదంలో మరణిస్తే: రూ. 10 లక్షలుశాశ్వత పూర్తి అంగవైకల్యం: రూ. 10 లక్షలుశాశ్వత పాక్షిక అంగవైకల్యం: రూ. 7.5 లక్షలుగాయాల కారణంగా ఆసుపత్రిలో చేరితే: రూ. 2 లక్షలుమృతదేహం రవాణా కోసం: రూ. 10 వేలు

రైల్వే చట్టం ప్రకారం ఈ సంఘటనలు 'రైలు ప్రమాదం' కిందకు వస్తాయి: 

ప్రయాణీకులను తీసుకెళ్తున్న రైలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రైళ్లను ఢీకొట్టడంరైలు లేదా రైలుకు సంబంధించిన భాగాలు పట్టాలు తప్పడంప్యాసింజర్ రైళ్లపై నేరుగా ప్రభావం చూపే ఏదైనా ఊహించని సంఘటనలురైల్వే స్టేషన్‌లో టెర్రరిస్టు చర్యలు, హింసాత్మక దాడులు, దోపిడీలు, అల్లర్లు ప్లాట్‌ఫారమ్‌పై, వెయిటింగ్ హాల్స్‌లో లేదా బుకింగ్ ఆఫీసుల్లో జరిగే అగ్నిప్రమాదాలు వంటి సంఘటనలు

ప్రయాణ బీమా పాలసీ నంబర్‌ ఎలా తెలుసుకోవాలి?

బాధిత ప్రయాణీకుడి ఇన్సూరెన్స్‌ పాలసీ నంబర్‌, ఇతర వివరాలను తెలిపే SMS & ఇ-మెయిల్‌ను బీమా కంపెనీ పంపుతుంది. IRCTC ఇ-టికెట్ వెబ్‌సైట్‌లోని టిక్కెట్ బుకింగ్ హిస్టరీలోనూ పాలసీ నంబర్‌ చూడొచ్చు.

రైలు ప్రయాణం చేసే సమయంలో, ఆ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడం ముఖ్యం. దీనివల్ల.. పాలసీ నంబర్, PNR నంబర్‌, ఇతర కీలక వివరాలు తెలుస్తాయి. ఇవి లేకుండా క్లెయిమ్ చేయడం కష్టం అవుతుంది.

ఒకవేళ రైలు ప్రమాదంలో జరిగినప్పుడు... ప్రయాణీకుడి ఫోన్‌ సరిగ్గా పనిచేస్తూ, అతను కూడా మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడే SMS లేదా ఇ-మెయిల్‌ ద్వారా పాలసీ వివరాలు సులభంగా తెలుస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించినా, లేదా అపస్మారక స్థితిలో ఉన్నా, అతని ఫోన్‌ పోయినా/ధ్వంసమైనా పాలసీ సంబంధ వివరాలను కుటుంబ సభ్యులు కనుక్కోలేకపోవచ్చు. పాలసీ నంబర్, PNR నంబర్‌ లేకపోతే తాము కూడా ఏమీ చేయలేమని ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెబుతున్నాయి.

ITRCTC ప్రయాణ బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి రైలు ప్రయాణికుడు లేదా అతని/ఆమె నామినీ లేదా చట్టపరమైన వారసుడు తప్పనిసరిగా సంబంధిత బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి నిర్దేశిత పత్రాలను అందించాలి. ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లోగా ఈ ప్రాసెస్‌ మొదలు పెట్టాలి. బీమా కంపెనీ కార్యాలయాన్ని సంప్రదిస్తే, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కోసం ఏయే పత్రాలు కావాలో చెబుతారు.

మరో ఆసక్తికర కథనం: గూగుల్‌ కొత్త టూల్‌ - ఇంటర్నెట్‌ నుంచి మీ పర్సనల్‌ డేటాను తీసేయండి