Aadhar Card Details Updation: మీ ఆధార్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే త్వరపడండి. ఫ్రీ ఆఫర్ ఇవాళ్టితో ముగుస్తుంది. ఆధార్ వివరాల్లో మార్పుచేర్పులను ఉచితంగా చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ (UIDAI) అవకాశం ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందారు.
ఇవాళ్టి వరకు ఫ్రీ
డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా UIDAI ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్లు మైఆధార్ (MyAadhaar) పోర్టల్‌లోకి వెళ్లి, డాక్యుమెంట్ అప్‌డేషన్ సౌకర్యాన్ని పూర్తి ఉచితంగా పొందవచ్చు. వాస్తవానికి ఈ సదుపాయం 15 మార్చి 2023 నుంచే అమల్లోకి వచ్చింది, నేటి (జూన్ 14, 2023) వరకు అందుబాటులో ఉంది. ఇవాళ్టి వరకు, MyAadhaar పోర్టల్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో వివరాలు అప్‌డేట్ చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆఫ్‌లైన్ పద్ధతిలో, అంటే ఆధార్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి వివరాలు అప్‌డేట్ చేయాలనుకుంటే మాత్రం గతంలోలాగే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత అప్‌డేషన్ సదుపాయం అందరికీ అందుబాటులో ఉంది. 10 సంవత్సరాల క్రితం ఆధార్ తీసుకుని ఆ తర్వాత ఎప్పుడూ అప్‌డేట్ చేయని వాళ్లను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఉడాయ్ ఈ ఫెలిలిటీ తీసుకువచ్చింది. ఆధార్‌లోని వివరాలను అప్‌డేట్ చేయడానికి గుర్తింపు రుజువు, చిరునామా రుజువును తిరిగి ధృవీకరించమని UIDAI కోరుతోంది. ఆధార్ కార్డ్ ఉన్న ఏ వ్యక్తి అయినా తన పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో మార్పులు చేయవచ్చు.
ఆధార్ కార్డ్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి?
పౌరులు https://myaadhaar.uidai.gov.in సైట్‌కు వెళ్లి తమ ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని సంబంధింత గడిలో నింపి 'ఎంటర్' నొక్కాలి. ఇప్పుడు డాక్యుమెంట్ అప్‌డేట్ క్లిక్ చేయాలి. ఇప్పటికే ఉన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి. వివరాలను ఆధార్ హోల్డర్ ధృవీకరించాల్సి ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉంటే, హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి. తదుపరి స్క్రీన్‌లో, డ్రాప్‌డౌన్ జాబితా నుంచి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు ఎంచుకోవాలి, ఆయా పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అప్‌డేషన్ పూర్తయి, ఉడాయ్ ఆమోదించిన తర్వాత, గుర్తింపు రుజువు చిరునామా రుజువు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి.
ఆధార్ కార్డ్‌లోని వివరాలను ఎందుకు అప్‌డేట్ చేయాలి?
భారత పౌరుడి అధికారిక గుర్తింపు పత్రాల్లో ఆధార్ ఒకటి. ఆధార్ అంటే వట్టి సంఖ్య మాత్రమే కాదు, ఆ కార్డులో సదరు వ్యక్తి పేరు, వయస్సు, చిరునామా వంటి సమాచారంతో పాటు అతి కీలకమైన వేలిముద్రలు (బయోమెట్రిక్), కంటిపాపల (ఐరిస్) సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి, ఇది చాలా ముఖ్యమైన పత్రం. వ్యక్తిగత గుర్తింపును నిరూపించుకోవాల్సిన ప్రతిచోటా దీని అవసరం ఉంటుంది. ఆధార్ లేకపోతే స్కూల్లో అడ్మిషన్ దొరకదు, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయలేం, ఉద్యోగంలో చేరలేం, ఏ ప్రభుత్వ పథకం అందదు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆధార్ కార్డ్ వివరాల్లో చిన్న తప్పు దొర్లినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల, ఆధార్‌లో తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం శ్రేయస్కరం.
మరో ఆసక్తికర కథనం: