Donald Trump Reciprocal Tariff On India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బుధవారం తెల్లవారుజామున (భారతదేశ కాలమానం ప్రకారం), భారతదేశానికి బిగ్‌ షాక్ ఇచ్చారు. జరగదులే అనుకున్న దానిని మొండిపట్టుతో నిజం చేసి చూపారు. అమెరికన్‌ పార్లమెంట్ (కాంగ్రెస్) సంయుక్త సమావేశంలో మాట్లాడిన ట్రంప్‌, భారతదేశంపై ప్రతీకార సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తున్నట్లు & 2025 ఏప్రిల్‌ 02 నుంచి అవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. అమెరికా నుంచి భారతదేశం 100 శాతానికి పైగా సుంకాలను వసూలు చేస్తోందని, ఏప్రిల్‌ నుంచి అమెరికా కూడా అదే విధంగా వసూలు చేయబోతోందని వెల్లడించారు. అంటే, ఏప్రిల్ 02 నుంచి, డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై ప్రతీకార సుంకం విధానాన్ని అమలు చేస్తారు. అమెరికన్‌ కాంగ్రెస్‌లో 1 గంట 44 నిమిషాలు ప్రసంగించిన ట్రంప్‌, 43 రోజుల పాలనలో తాను చేసిన పనిని, అనేక ప్రభుత్వాలు తమ 4 లేదా 8 సంవత్సరాల పరిపాలన కాలంలో చేయలేకపోయాయని అన్నారు. 


రెసిప్రోకల్‌ టారిఫ్‌ అంటే ఏమిటి?
రెసిప్రోకల్‌ అంటే పరస్పరం లేదా ప్రతీకారం తీర్చుకోవడం అని అర్ధం. దీనిని 'టిట్ ఫర్ టాట్' పాలసీ అని కూడా చెప్పవచ్చు. ఒక దేశం మరొక దేశంపై విధించే పన్ను లేదా వాణిజ్య పరిమితికి బదులుగా, రెండో దేశం కూడా మొదటి దేశంపై ఇదే పన్ను లేదా పరిమితిని విధించడాన్ని రెసిప్రోకల్‌ టారిఫ్‌ లేదా పాలసీ అంటారు. ఉదాహరణకు.. ఒక దేశం మరొక దేశ వస్తువుల దిగుమతులపై 100 శాతం పన్ను విధిస్తే, రెండో దేశం కూడా మొదటి దేశ ఉత్పత్తుల దిగుమతులపై 100 శాతం పన్ను విధించవచ్చు. దీనినే పరస్పర సుంకం లేదా ప్రతీకార సుంకం అంటారు. 


ప్రతీకార సుంకం ఉద్దేశం ఏంటి?
రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యంలో సమతుల్యతను కాపాడుకోవడం రెసిప్రోకల్‌ టారిఫ్‌ ఉద్దేశం. అయితే, ఈ ఉద్దేశం ఇప్పుడు గతి తప్పుతోంది.


వాణిజ్య సమతుల్యత: రెసిప్రోకల్‌ టారిఫ్‌ భయంతో ఒక దేశం మరొక దేశంపై అధిక పన్నులు విధించదు, దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్య సమతుల్యం కొనసాగుతుంది.
స్థానిక పరిశ్రమలకు రక్షణ: పన్నుల వల్ల విదేశీ వస్తువుల ఖరీదుగా మారినప్పుడు స్థానిక ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి, దేశీయ పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి.
వాణిజ్య చర్చలలో భాగం: కొన్నిసార్లు దేశాలు దీనిని చర్చల అస్త్రంగా ఉపయోగించి ఇతర దేశం పన్నులు తగ్గించుకునేలా చేస్తాయి.


ప్రతీకార సుంకంలో ప్రతికూలతలు
వాణిజ్య యుద్ధం: రెండు దేశాలు ఒకదానిపై మరొకటి పన్నులు విధించుకుంటూ పోతే అది వాణిజ్య యుద్ధంగా మారవచ్చు. ఇప్పుడు, అమెరికా, భారత్‌ సహా వివిధ దేశాలపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది.
ద్రవ్యోల్బణం: సుంకాల కారణంగా విదేశీ వస్తువుల ధరలు పెరిగి వినియోగదారులు నష్టపోతారు.
సరఫరా గొలుసు అంతరాయాలు: వాణిజ్య యుద్ధాలు ప్రపంచ సరఫరా గొలుసులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.


ప్రతీకార సుంకాల చరిత్ర
ప్రతీకార సుంకాలు 19వ శతాబ్దంలో ఉద్భవించాయి, ఒక దేశంపై మరొక దేశం సుంకాలు పెంచుకుంటూ వెళ్లి వాణిజ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోశాయి. 1860లో, బ్రిటన్ - ఫ్రాన్స్ మధ్య కాబ్డెన్-చెవాలియర్ ఒప్పందం కుదిరింది, దీని ఫలితంగా సుంకాలు & వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గాయి. ఆ తర్వాత, 1930లో మళ్లీ తెరపైకి వచ్చాయి. అప్పుడు, యునైటెడ్ స్టేట్స్ స్మూట్-హాలీ టారిఫ్ చట్టాన్ని అమలు చేసింది. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసింది, ఆర్థిక మాంద్యాన్ని (Economic Recession) మరింత తీవ్రతరం చేసింది. ట్రంప్ 2.0 హయాంలో ప్రతీకార సుంకాలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. ట్రంప్‌ ప్రభుత్వం చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, మెక్సికోపై రెసిప్రోకల్‌ టారిఫ్‌లు విధించింది. ఆయా దేశాలు కూడా అమెరికన్ వస్తువులపై పన్నులు విధించడం ద్వారా గట్టిగా ప్రతిస్పందించాయి.


మరో ఆసక్తికర కథనం: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'