World 100 Most Influential People of 2023: ప్రపంచంలోనే అత్యంత ప్రతిభాశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజీన్‌‌ (Time magazine) విడుదల చేసింది. ఇందులో, RRR సినిమాలో పాటకు ఆస్కార్‌ అందుకోవడంతో పాటు ప్రపంచన్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జక్కన్న (ఎస్‌.ఎస్‌. రాజమౌళి) తొలిసారి చోటు సంపాదించాడు, మరోమారు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 


ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, గాయకులు, అధ్యక్షులు, కళాకారులు, రచయితలు, ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు టైమ్‌ మ్యాగజీన్‌ లిస్ట్‌లో ఉన్నారు. టైమ్ మ్యాగజీన్‌ విడుదల చేసిన "వరల్డ్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2023" లిస్ట్‌లో ఉన్నారు. బాలీవుడ్‌ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), ఇండియన్‌ అమెరికన్ రచయిత సల్మాన్ రష్దీ (Salman Rushdie), టెలివిజన్‌ హోస్డ్‌ & జడ్జ్‌ పద్మ లక్ష్మి (Padma Lakshmi) కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు.


టైమ్ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ జాబితాలో, గ్లోబల్ లీడర్‌లు, స్థానిక కార్యకర్తలు, కళాకారులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు సహా చాలా రంగాల్లో కీర్తి గడించిన పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో రికార్డు స్థాయిలో 16 మంది పర్యావరణవేత్తలు ఉన్నారు. ఈ ప్రతిభావశీలురైన వ్యక్తులను అనేక పారామితులను ఆధారంగా చేసుకుని టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. ఆ మ్యాగజీన్‌‌ చెప్పిన ప్రకారం.. వాతావరణం, ప్రజారోగ్యం నుంచి ప్రజాస్వామ్యం, సమానత్వం వరకు వివిధ కారకాల ఆధారంగా లిస్ట్‌ తయారైంది. టైమ్ మ్యాగజీన్ 100 లిస్ట్‌లో ఉన్న వ్యక్తుల్లో, ప్రపంచ ప్రముఖుల నుంచి ఎక్కువ మందికి అసలు తెలియని వాళ్లు కూడా ఉన్నారు.


ప్రభావశీల వ్యక్తుల జాబితాలో జర్నలిస్టులు                 
ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో కొందరు జర్నలిస్ట్‌ల పేర్లు కూడా చేరడం విశేషం. ఇరాన్‌ విరోధం, రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా జర్నలిస్టులు కూడా లిస్ట్‌లోకి ఎక్కారు. టైమ్ 100 జాబితాలో ఇరానియన్ జర్నలిస్టులు ఇలాహె మొహమ్మది, నీలోఫర్ హమీదీ చోటు సంపాదించారు. రష్యాపై విడుదల చేసిన నివేదికపై విచారణను ఎదుర్కొంటున్న వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్‌కోవిచ్‌తో సహా ముగ్గురు జర్నలిస్టులు లిస్ట్‌లో ఉన్నారు.


ప్రపంచ ప్రముఖులు              
ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden), కింగ్ చార్లెస్ (King Charles,), సిరియాలో జన్మించిన స్విమ్మర్లు, కార్యకర్తలు సారా మర్దిని, యుస్రా మర్దిని ‍‌‍‌(Sara Mardini, Yusra Mardini), స్టార్ ఐకాన్ బెల్లా హడిద్ (Bella Hadid), బిలియనీర్ CEO ఎలాన్ మస్క్ (Elon Musk), దిగ్గజ గాయకుడు & కళాకారుడు బెయోన్స్ (Beyonce) కూడా ఉన్నారు.


ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్
టైమ్ మ్యాగజీన్‌‌లో ఎలాన్‌ మస్క్‌ పేరు ఎప్పుడూ ఉంటుంది, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడీ ప్రపంచ కుబేరుడు. ప్రస్తుతం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, ఎలాన్ మస్క్‌ మొత్తం ఆస్తుల విలువ 188.5 బిలియన్‌ డాలర్లు.