America - India Trade: అమెరికా బాగు కోసమంటూ కఠిన వాణిజ్య వైఖరి అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, కెనడాపై ప్రకటించిన 25 శాతం సుంకాలు మంగళవారం (04 మార్చి 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. డ్రాగన్‌ కంట్రీ చైనాపైనా గతంలో విధించిన 10 శాతం సుంకాలను 20 శాతానికి పెంచారు. ఇది వాణిజ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది.


ఏప్రిల్ 02 నుంచి భారతదేశంపై సుంకాల మోత
తాజాగా సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, అమెరికన్ రైతులను దేశీయ మార్కెట్ కోసం ఎక్కువ ఉత్పత్తి చేయాలని కోరారు. ఏప్రిల్ 02 నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించనున్నట్లు ఆ పోస్ట్‌లో స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని భారతదేశంపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. అలా చేయడం వల్ల కోట్లాది మంది పేద రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని భారతదేశం వాదిస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, ఈ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికాలో పర్యటించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, అమెరికా-భారత్‌ పరస్పర సుంకాలపై చర్చించారు.


సుంకాల వల్ల ఏయే భారతీయ పరిశ్రమలు ప్రభావితమవుతాయి?
మార్కెట్‌ నిపుణుల అంచనాల ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం భారతదేశంపై కఠినమైన సుంకాలను విధిస్తే, మూడు రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. వాటిలో మొదటి రంగం పెట్రోకెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్. ఇవి భారతదేశపు ప్రధాన ఎగుమతి రంగాలు, అమెరికాలో వీటికి భారీ డిమాండ్ ఉంది. రెండోది ఎలక్ట్రానిక్స్ & వైద్య పరికరాలు. వీటిపై అదనపు సుంకం విధించడం వల్ల భారతదేశ ఎగుమతులపై ప్రభావం పడుతుంది. మూడోది ఆటోమొబైల్ & ఎలక్ట్రిక్ వాహనాల రంగం. టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడానికి భారతదేశం కొత్త EV విధానాన్ని రూపొందించింది. అయితే, US విధించే సుంకాలు ఈ ప్రణాళికకు ఎదురుదెబ్బలా మారవచ్చు.


భారతదేశం ఎంత నష్టపోతుంది?
అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులు $35 బిలియన్లకు చేరుకుంది, ఇది భారతదేశ GDPలో 1 శాతం. సుంకాలు పెరిగితే, ఈ మిగులు తగ్గవచ్చు. ఇది, భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. S & P గ్లోబల్ రేటింగ్స్ అంచనా ప్రకారం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ దేశీయ డిమాండ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి, అమెరికా సుంకాల ప్రభావం పరిమితంగా ఉంటుంది. అయినప్పటికీ, అమెరికా సుంకాలకు భారతదేశం నుంచి కూడా ప్రతీకార చర్య ఉండవచ్చు.


ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఉక్కు & అల్యూమినియం వంటి అనేక ఉత్పత్తులపై 25 శాతం వరకు సుంకాలను విధించింది. ఈ కొత్త సుంకం $918 బిలియన్ల విలువైన దిగుమతులను ప్రభావితం చేస్తుంది. ఈ నిర్ణయం తర్వాత, ప్రపంచ మార్కెట్లో తీవ్ర క్షీణత కనిపించింది. యూరోపియన్ యూనియన్ (EU) నుంచి వచ్చే ఉత్పత్తులతో పాటు ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్ల దిగుమతులపై అమెరికా సుంకాలు విధిస్తుందని ట్రంప్ గతంలోనే చెప్పారు.        


మరో ఆసక్తికర కథనం: డెజెర్ట్ కూలర్ లేదా టవర్ కూలర్‌ - మీ ఇంటికి ఏది బెస్ట్‌ ఛాయిస్‌?