TCS Salary Hike:
దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ (TCS) ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది! ఆపరేటింగ్ మార్జిన్‌పై 200 బేసిస్ పాయింట్ల ప్రభావం పడుతున్నప్పటికీ వేతనాలు పెంచుతున్నామని ప్రకటించింది. ఒకవైపు ఇన్ఫోసిస్ జీతాల పెంపును వాయిదా వేసిందన్న వార్తలు వస్తుంటే టీసీఎస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
'మేం ముందుకు వెళ్లాం! ఏప్రిల్ 1 నుంచి వార్షిక వేతనాలు పెంచాం. మా ఆపరేటింగ్ మార్జిన్ 23.2 శాతంలో 200 బేసిస్ పాయింట్ల వరకు వేతనాల పెంపు ప్రభావం కనిపిస్తుంది' అని టీసీఎస్ సీఎఫ్‌వో సమీర్ సెక్‌సారియా అన్నారు. తాజా వార్షిక వేతన సమీక్షలో అత్యుత్తమంగా పనిచేస్తున్న ఉద్యోగులకు 12-15 శాతం వరకు జీతాలు పెంచారు. అలాగే ప్రమోషన్లు కల్పించారు.
కంపెనీలో అట్రిషన్ స్థాయి క్రమంగా తగ్గుతోందని టీసీఎస్ తెలిపింది. ఈ అంశంలో ఇండస్ట్రీలో తామే ముందుంటామని ధీమా వ్యక్తం చేసింది. గత 12 నెలలతో పోల్చుకుంటే తొలి త్రైమాసికంలో ఐటీ సేవల్లో అట్రిషన్ రేట్ తగ్గిందని, 17.8 శాతానికి చేరుకుందని జూన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక జూన్ 30 నాటికి కంపెనీలో 6,15,318 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా క్వార్టర్లో 523 మంది పెరిగారు. ఉద్యోగుల్లో వైవిధ్యం ఉందని, 154 దేశాల వారు పనిచేస్తున్నారని వెల్లడించింది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో మహిళలు 35.8 శాతం ఉన్నారని పేర్కొంది.
'ఇండస్ట్రీలోని అత్యుత్తమ ప్రతిభావంతులపై మేం దృష్టి సారించాం. వారిని అభివృద్ధి చేస్తున్నాం. ఉద్యోగాల్లోకి తీసుకొని రివార్డులు అందిస్తున్నాం. తిరిగి కార్యాలయానికి వచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే ప్రతి మూడు వారాలకు ఒకసారి 55 శాతం మంది వస్తున్నారు' అని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ అన్నారు.
టీసీఎస్ రిజల్ట్స్
టీసీఎస్ బుధవారం సాయంత్రం ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.11,074 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.9,478 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించింది. ఇక ఆపరేషన్స్ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.59,381 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.9 డివిడెండ్ ఇస్తామని తెలిపింది. ఇందుకు జులై 20ని రికార్డు తేదీగా ఫిక్స్ చేసింది. ఆగస్టు 7న ఇన్వెస్టర్ల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. గతేడాది కంపెనీ ఒక్కో షేరుకు రూ.115 డివిడెండ్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.