TCS Q3 result: 2023-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్- డిసెంబర్) ఫలితాల సీజన్‌ను, తన రిజల్ట్స్ ప్రకటనతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రారంభించింది. డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY23), కలగూరగంప లాంటి ఫలితాలను ఈ ఐటీ మేజర్ ప్రకటించింది.
సీజనల్‌గా చూస్తే, డిసెంబర్ త్రైమాసికం ఒక వీక్ క్వార్టర్. ఏ ఐటీ కంపెనీకి అయినా ఈ త్రైమాసికంలో నంబర్స్ తగ్గడం సహజమే. ఈసారి మాంద్యం ఆందోళనల ప్రభావం కూడా ఐటీ కంపెనీల ఫలితాల మీద ఉంటుంది.
Q3లో TCS ఏకీకృత నికర లాభం (consolidated net profit) 10.98 శాతం పెరిగి రూ. 10,883 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ కంపెనీ రూ. 9,806 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ. 58,229 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 48,885 కోట్లతో పోలిస్తే ఇది 19.11 శాతం పెరిగింది.
అంచనాలను అందుకోని లాభం
ఫలితాల్లో అసలు విషయం ఏంటంటే... కంపెనీ ఆదాయం, మార్కెట్ అంచనాలను అధిగమించింది. డిసెంబర్ త్రైమాసికంలో రూ. 56,893 కోట్ల ఆదాయాన్ని ఐటీ మేజర్ ఆర్జిస్తుందని ఎనలిస్ట్‌లు అంచనా వేశారు. అయితే.. లాభం అంచనాల కంటే తక్కువగా ఉంది. రూ. 11,200 కోట్ల లాభాన్ని ప్రకటిస్తుందని నిపుణులు లెక్కలు వేశారు.
స్థిర కరెన్సీ (constant currency - CC) ప్రాతిపదికన.. ఆదాయం 13.5 శాతం (YoY) వృద్ధి చెందింది. ఉత్తర అమెరికా, యూకేలో బిజినెస్ గతేడాది ఇదే కాలం (YoY) కంటే 15.4 శాతం పెరిగింది. ఆదాయ వృద్ధికి ప్రధాన కారణం ఇదే. డాలర్ ప్రాతిపదికన మాత్రం కంపెనీ ఆదాయం 8 శాతం తగ్గింది.
డిసెంబర్ త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 0.5 శాతం తగ్గి 24.5 శాతానికి పరిమితమైంది. నెట్ మార్జిన్ 18.6 శాతంగా ఉంది.
దాదాపు 3 ఏళ్ల ఏళ్ల తర్వాత, ఒక త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదలను టీసీఎస్ ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరులో మొత్తం సిబ్బంది సంఖ్య 2,197 తగ్గి, 6,13,974కు చేరింది. ఇలా, ఒక త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం గత పది త్రైమాసికాల్లో ఇదే తొలిసారి.
సమీక్ష కాలంలో, 7.9 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను టీసీఎస్ విన్ అయింది. కంపెనీ నిర్దేశించుకున్న 7-9 బిలియన్ డాలర్ల టార్గెట్‌ను రీచ్ అయిందని TCS CEO రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. ఆర్డర్లు, కాంట్రాక్టుల పరంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు.
రూ.75 డివిడెండ్
రూ.1 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుకు 75 రూపాయల డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది. ప్రత్యేక డివిడెండ్ రూ. 67ను కలిపి ఈ మొత్తాన్ని ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపు కోసం రూ. 33,000 కోట్లను కంపెనీ పక్కన పెట్టింది. డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డ్ డేట్ 2023 జనవరి 17వ తేదీ. డివిడెండ్ చెల్లింపు తేదీ 2023 ఫిబ్రవరి 3వ తేదీ.
నిన్న (సోమవారం, జనవరి 09, 2023) రూ. 3,319.70 వద్ద ముగిసిన టీసీఎస్ షేర్ ధర, ఇవాళ (మంగళవారం, జనవరి 10, 2023) రూ. 3,290 వద్ద, గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.