Stock Market Today, 14 February 2024: గ్లోబల్ మార్కెట్ల నుంచి అత్యంత బలహీన సంకేతాలు అందుతున్నాయి. భారతీయ ఈక్విటీల్లో ట్రేడింగ్‌ కూడా ఈ రోజు (బుధవారం) గట్టి నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 202 పాయింట్లు లేదా 0.93 శాతం రెడ్‌ కలర్‌లో 21,631 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-డౌన్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో... ఈ ఉదయం హాంగ్ సెంగ్, కోస్పి, స్ట్రెయిట్స్ టైమ్స్ తలో 1 శాతానికి పైగా క్షీణించాయి, జపాన్ నికాయ్‌ 0.7 శాతం పడిపోయింది.


మార్కెట్‌ అంచనాల కంటే అమెరికన్ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడంతో, నిన్న, US మార్కెట్లలో ప్రధాన సూచీలన్నీ 2 శాతం వరకు పడిపోయాయి. లేబర్ డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2024 జనవరిలో సీపీఐ ఇన్‌ఫ్లేషన్‌ 0.3 శాతం పెరిగింది. అయితే, 0.2 శాతం పెరుగుతుందన్న మార్కెట్‌ అంచనాను దాటింది. అందువల్ల, అధిక వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగవచ్చని పెట్టుబడిదార్లు భయపడ్డారు.


US 10 ఇయర్‌ బాండ్‌ ఈల్డ్‌ సోమవారం నాటి 4.17 శాతంతో పోలిస్తే మంగళవారం 4.3123 శాతానికి పెరిగింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యే కొత్త కంపెనీలు: క్యాపిటల్ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.


అదానీ గ్రూప్: ప్రపంచ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్, మంగళవారం, నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల ఔట్‌లుక్‌ను ‘స్టేబుల్’కు సవరించింది. USకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత వీటికి 'నెగెటివ్' రేటింగ్‌ ఇచ్చిన మూడీస్‌, ఒక సంవత్సరం తర్వాత స్టేబుల్‌కు మార్చింది. ఆ కంపెనీలు.. అదానీ గ్రీన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌.


హిందాల్కో: 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో (Q3FY24), కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 71.1 శాతం పెరిగి రూ.2,331 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో ఆదాయం రూ.52,808 కోట్ల వద్ద స్థిరంగా ఉంది.


ఐషర్‌ మోటార్స్‌: Q3 నికర లాభం 34.4 శాతం YoY పెరిగి రూ. 996 కోట్లకు చేరుకుంది, విశ్లేషకుల అంచనాలైన రూ. 989 కోట్లను కూడా దాటింది. ఆదాయం 12.3 శాతం YoY వృద్ధితో రూ.4,179 కోట్లకు చేరింది.


భెల్‌ (BHEL): అధిక ఖర్చుల కారణంగా, 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.148.77 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ఈ కంపెనీ మూటగట్టుకుంది. అయితే, మొత్తం ఆదాయం ఏడాది క్రితం నాటి రూ.5,353.94 కోట్ల నుంచి స్వల్పంగా రూ.5,599.63 కోట్లకు పెరిగింది.


ఆయిల్ ఇండియా: Q3 నికర లాభం 9.3 శాతం తగ్గి రూ.1,584 కోట్లకు పరిమితమైంది. ముడి చమురు ధరలు తగ్గడం, ప్రభుత్వం విధించిన విండ్‌ఫాల్ టాక్స్‌ కారణంగా లాభం తగ్గింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పేకమేడలా పడుతున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే