Sensex And Nifty Down: ఈ రోజు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లలో ఊచకోత, రక్తపాతం కనిపిస్తోంది. BSE సెన్సెక్స్ దాదాపు 1400 పాయింట్లు జారిపోయింది. NSE నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనమైంది. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, మండుతున్న ముడి చమురు ధరలు, సెబీ కొత్తగా తీసుకొచ్చిన F&O రూల్స్‌ కత్తుల్లా మారి మార్కెట్‌ మీద పడ్డాయి. బుధవారం మన మార్కెట్లకు సెలవు కాబట్టి, ఈ రెండు రోజుల గ్లోబల్ సూచనలకు అనుగుణంగా కూడా మార్కెట్‌ ప్రతిస్పందిస్తోంది. వీక్లీ F&O సిరీస్ గడువు నేటితో ముగియడమూ ట్రేడింగ్‌ను ఒడుదొడుకుల్లోకి నెట్టింది. 


మధ్యాహ్నం సమయానికి, NSE ఇండియా VIX 9.57% పెరిగి 13.14కి చేరుకుంది. మార్కెట్‌లో ఆందోళనలను ఇది సూచిస్తోంది.


గత సెషన్‌లో దూసుకెళ్లిన ఆటో షేర్లు ఈ రోజు రివర్స్‌ గేర్‌ వేశాయి. వార్త రాసే సమయానికి, నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏకంగా 1.86% క్షీణించి 26,579.05 వద్దకు చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో ఇండెక్స్ 0.21% పెరిగింది. అపోలో టైర్స్ (4.15%), ఐషర్ మోటార్స్ (3.64%), బాలకృష్ణ ఇండస్ట్రీస్ (3.20%), టాటా మోటార్స్ (2.83%), టీవీఎస్ మోటార్ కంపెనీ (2.72%), బజాజ్ ఆటో (2.26%), మారుతి సుజుకీ (2.12%), సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ (1.77%), ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (1.46%), MRF (1.37%) పడిపోయాయి.


ఉదయం 11.30 గంటల సమయానికి బీఎస్‌ఇ సెన్సెక్స్ 1,230.68 పాయింట్లు లేదా 1.46% పడిపోయి 83,045.56 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 50 ఇండెక్స్ 372.85 పాయింట్లు లేదా 1.45% పడిపోయి 25,424.05 వద్ద ట్రేడవుతోంది.


మధ్యాహ్నం 12.35 గంటల సమయానికి, BSE 1,285.23 పాయింట్లు లేదా 1.53% పడిపోయి 82,981.06 వద్ద ఉంది. NSE నిఫ్టీ 393.05 పాయింట్లు లేదా 1.52% తగ్గి 25,403.85 వద్ద ట్రేడవుతోంది.


ప్రధాన ఇండెక్స్‌ల్లో ఎక్కువ నష్టాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ నాయకత్వం వహిస్తున్నాయి. 


నిఫ్టీని దిగలాగిన టాప్‌-10 స్టాక్స్‌


-- నిఫ్టీలోని టాప్-10 లూజర్స్‌ ఆ ఇండెక్స్‌లో 60% పైగా నష్టాలకు కారణమయ్యాయి. నిఫ్టీ పతనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ కంట్రిబ్యూటర్. ఈ షేరు వరుసగా మూడో రోజు పతనమైంది, మెయిన్‌ ఇండెక్స్‌ పతనంలో దాదాపు 50 పాయింట్లు కాంట్రిబ్యూట్‌ చేసింది.


-- నిఫ్టీని కిందకు లాగే పనిలో, రెండో స్థానం కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ పోటీ పడుతున్నాయి. దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌ (HDFC బ్యాంక్) వరుసగా నాలుగో రోజూ దిగజారింది, ఈ రోజు నిఫ్టీ 50 పతనానికి 39 పాయింట్లు తోడ్పడుతోంది.


-- ICICI బ్యాంక్ ఇటీవల రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పుడు, అధిక స్థాయిల నుండి ప్రాఫిట్ బుకింగ్‌ చూస్తోంది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్‌లలో మూడుసార్లు నష్టపోయింది. నిఫ్టీ ఇండెక్స్‌ పతనానికి 37 పాయింట్లను అందించింది.


-- L&T కూడా మరో ప్రధాన కారణం. గత వారం HSBC ఈ స్టాక్‌ను డౌన్‌గ్రేడ్ చేసినప్పటి నుంచి ఇది కరెక్షన్ మోడ్‌లో ఉంది. ఈ రోజు నిఫ్టీ క్షీణతకు 33 పాయింట్లు దోహదపడింది.


-- యాక్సిస్ బ్యాంక్ షేర్లు 3% పైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి, వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ పతనానికి ఈ రుణదాత 22 పాయింట్లు అందించింది.


-- నేటి ట్రేడింగ్ సెషన్‌లో నష్టపోయిన కంపెనీల లిస్ట్‌లో రెండు టాటా గ్రూప్ కంపెనీలు - TCS & టాటా మోటార్స్ ఉన్నాయి. ఈ రోజు సెషన్‌లో టాటా మోటార్స్ 4% పైగా క్షీణించగా, వచ్చే గురువారం (అక్టోబర్ 10) ఫలితాలు వెల్లడించనున్న TCS 1.6% క్షీణించింది. నిఫ్టీ పతనానికి రెండు స్టాక్స్‌ తలో 14 పాయింట్లు యాడ్‌ చేశాయి.


-- ITC, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ కూడా ఒక్కొక్కటి 13 పాయింట్లు కాంట్రిబ్యూట్‌ చేశాయి. ఐటీసీ 1 శాతం పైగా నష్టాలతో ట్రేడవుతుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కేఆర్‌ఎన్‌ హీట్ ఎక్స్ఛేంజర్ సూపర్ డూపర్ ఎంట్రీ - ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్‌