Stock Market Holiday 01 May 2024: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రెండో నెల ఈ రోజు (01 మే 2024) నుంచి ప్రారంభమైంది. కొత్త నెల మొదటి రోజునే భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు వచ్చింది. ఈ రోజు దలాల్ స్ట్రీట్‌లో ట్రేడింగ్ జరగదు.
ఈ రోజు, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (International Workers' Day 2024). సమాజ నిర్మాణానికి సాయం చేసే కార్మికుల గౌరవార్ధం, వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా మే 01వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుతారు. దీనిని మే డే (May Day) అని కూడా పిలుస్తారు.
మహారాష్ట్ర అవతరణ దినోత్సవం
మహారాష్ట్ర దినోత్సవం (Maharashtra Day 2024) కూడా ఈ రోజే. భారతదేశంలో భాష ప్రాతిపదికన కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆమోదం లభించిన తర్వాత, 01 మే 1960న మహారాష్ట్ర పేరుతో కొత్త రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది. ఇదే రోజున బాంబే ప్రెసిడెన్సీ ముగిసింది, మరాఠీ ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతి సంవత్సరం మే 01న మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం లేదా మహారాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు మహారాష్ట్ర అంతటా ప్రభుత్వ సెలవు దినం. మహారాష్ట్రలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ రోజు తెరుచుకోవు, బ్యాంకులకు కూడా సెలవు.
ప్రధాన దేశీయ స్టాక్ మార్కెట్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్ BSE, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ NSE రెండూ మహారాష్ట్రలో (ముంబైలో) ఉన్నాయి. ఈ కారణంగా, మహారాష్ట్రలో ప్రభుత్వ సెలవు వచ్చినప్పుడల్లా దేశీయ ప్రధాన స్టాక్ మార్కెట్లు రెండూ మూతబడతాయి. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు NSE, BSEకి సెలవు వచ్చింది.
2024 మే నెలలో స్టాక్ మార్కెట్‌కు మరికొన్ని సెలవులు వచ్చాయి. ఈ నెల 20వ తేదీ (సోమవారం) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. మే నెలలో వచ్చిన రెండో సెలవు అది. 2024 సార్వత్రిక ఎన్నికల (Lokshabha Elections 2024) ఐదో దశ కింద ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. కాబట్టి, ఆ రోజు కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదు. శని, ఆదివారాలతో కలిపి, మే నెలలో దేశీయ స్టాక్ మార్కెట్‌కు మొత్తం 10 సెలవులు వచ్చాయి.
ఈ ఏడాది మరికొన్ని సెలవులు
జూన్ 17న (సోమవారం) - బక్రీద్; జులై 17న (బుధవారం) - మొహర్రం; ఆగస్టు 15 (గురువారం) - భారత స్వాతంత్ర్య దినోత్సవం; అక్టోబర్ 02న (బుధవారం) - జాతిపిత మహాత్మాగాంధీ జయంతి; నవంబర్ 01న (శుక్రవారం) - దీపావళి లక్ష్మి పూజ; నవంబర్ 15న (శుక్రవారం) - గురునానక్ జయంతి; డిసెంబర్ 25న (బుధవారం) - క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవులు వచ్చాయి.
ఈ ఏడాది దీపావళి (Diwali 2024) సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ (Muhurat Trading 2024 Timings) నవంబర్ 01న, శుక్రవారం నాడు ఉంటుంది. ఆ రోజున, ఏ సమయంలో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ జరుగుతుందన్న విషయాన్ని స్టాక్ మార్కెట్లు త్వరలో ప్రకటిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి