Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక వ్యవస్థ సంకేతాలు బాలేవు. దాంతో మదుపర్లు ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవ్వడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,240 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 105 పాయింట్లు నష్టపోయింది.   


BSE Sensex


క్రితం సెషన్లో 54,470 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,309 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. 54,857 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. క్లోజింగ్‌ సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు పెరగడంతో 54,226 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 105 పాయింట్ల నష్టంతో 54,364 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 16,301 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,248 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి నష్టాల్లోనే కదలాడింది. 16,248 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అమ్మకాల సెగతో 16,197 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 61 పాయింట్ల నష్టంతో 16,240 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అయింది. ఉదయం 34,181 వద్ద మొదలైంది. 34,176 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,181 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 207 పాయింట్ల లాభంతో 34,482 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభపడగా 34 నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్‌ యునీలివర్‌, ఆసియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. బ్యాంకు తప్ప మిగతా రంగాల సూచీలు నష్టపోయాయి. మెటల్‌, పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, హెల్త్‌కేర్‌, ఐటీ, రియాల్టీ సూచీలు 1-5 శాతం వరకు పతనం అయ్యాయి.