Stock Market update: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా పతనం అవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ఒకవైపు చమురు ధరలు కొండెక్కుతున్నాయి. మరోవైపు గ్లోబల్‌ మార్కెట్లు నష్టాల పాలవుతున్నాయి. ఇంకోవైపు ప్రపంచ ఎకానమీపై యుద్ధ ప్రభావం పడింది. మొత్తంగా ఇవన్నీ మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటును పెంచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 778 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,605 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 56,247 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ నేడు 55,629 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. విక్రయాలు కొనసాగడంతో సూచీ 55,020 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మూడు గంటల తర్వాత కాస్త కొలుకొని ఇంట్రాడే గరిష్ఠమైన 55,755కు చేరుకుంది. మొత్తంగా 778 పాయింట్ల నష్టంతో 55,468 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 16,793 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,593 వద్ద ఆరంభమైంది. ఉదయం 16,478 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో పుంజుకొని 16,678 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 187 పాయింట్ల నష్టంతో 16,605 వద్ద ముగిసింది.


Bank Nifty


బ్యాంకు నిఫ్టీ ఉదయం 35,381 వద్ద మొదలైంది. 34,897 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఆఖర్లో కాస్త మద్దతు లభించడంతో 35,553 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 832 పాయింట్ల నష్టంతో 35,372 వద్ద ముగిసింది.ఓ


Gainers and Lossers


నిఫ్టీలో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ముగిశాయి. కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టాటా స్టీల్‌, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్ పెయింట్స్‌, హీరోమోటో కార్ప్‌ నష్టపోయాయి. బ్యాంకు సూచీ 2 శాతం పడిపోగా మెటల్స్‌, పవర్‌ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగతా సూచీలు నష్టపోయాయి.