Stock Market Update: స్టాక్‌ మార్కెట్లలో (Stock market) శుక్రవారం రక్తకన్నీరు ప్రవహిస్తోంది! సూచీలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. పతనం తప్ప మరొకటి తెలియన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. ఐరోపాలోని అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌పై రష్యా షెల్లింగ్‌ మొదలు పెట్టడంతో ఇన్వెస్టర్లు (Investers) ఒక్కసారిగా భయపడ్డారు. ఈ ప్లాంట్‌ యుద్ధం (Russia-Ukrain war) జరుగుతున్న ఉక్రెయిన్‌లోనే ఉంది. దాంతో అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. అమెరికా ఇండెక్స్‌ ఫ్యూచర్లు, ఆసియా మార్కెట్లతో పాటు భారత స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.


ఉక్రెయిన్‌లోని జపోరిజియా న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌పై (Zaporizhzhia Nuclear Power Plant)  శుక్రవారం ఉదయం రష్యన్‌ దళాలు బాంబు వర్షం కురిపించాయి. దాంతో ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న జ్వాలలను ఆర్పేందుకు రప్పిస్తున్న ఫైర్‌ఫైటర్స్‌ను రష్యన్లు అడ్డుకుంటున్నారని ఉక్రెయిన్‌ తెలిపింది. ఇప్పటికైతే అక్కడ్నుంచి రేడియేషన్ బయటకు వచ్చిన దాఖలాలు కనిపించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.


యుద్ధ భయంతో ఆసియా స్టాక్స్‌ 16 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. బ్రెండ్‌ క్రూడాయిల్‌ (Brent crude oil) మే నెల ఫ్యూచర్స్‌ బ్యారెల్‌కు 114.23 డాలర్లుకు పెరిగింది. గురువారం ఈ కాంట్రాక్టులు 2.2 శాతం తగ్గాయి. ఇక శుక్రవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex)  1,016 పాయింట్ల మేర పతనమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 278 పాయింట్లు పతనమై 16,219 వద్ద కదలాడింది. ప్రస్తుతానికి కాస్త కోలుకున్నాయి!


'16,400-16,500 వద్ద నిఫ్టీ (NSE Nifty) మరింతగా కన్సాలిడేట్‌ అవుతోంది. ఆ పై స్థాయిల్లో నిలదొక్కుకోవడంలో విఫలమైంది. మరోసారీ మదుపర్లు షేర్లను తెగనమ్మేందుకు ఆస్కారం ఉంది. 16,200 స్థాయి వద్ద సూచీకి పరీక్ష ఎదురవ్వనుంది. దురదృష్టం వెంటాడితే సూచీ మరింత పతనం అవ్వొచ్చు' అని ఏంజిల్‌వన్‌ ప్రతినిధి సమీత్‌ చవాన్‌ అంటున్నారు.


ఆసియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యునీ లివర్‌, మారుతీ సుజుకీ 5 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హీరోమోటో కార్ప్‌ 3-4 శాతం వరకు నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, యూపీఎల్‌ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ప్రమోటర్ల ద్వారా రూ.14,500 కోట్లు సేకరించేందుకు వొడాఫోన్‌ ఐడియా నిర్ణయం తీసుకోవడంతో షేరు ధర 3.16 శాతం నష్టపోయింది.