Demat Accounts Opening In May 2023: మన దేశంలో స్టాక్ మార్కెట్‌ మీద ప్రజల్లో ఆసక్తి నానాటికీ పెరుగుతోంది. దానికి తగ్గట్లే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా ఓపెన్‌ అవుతున్న డీమ్యాట్ ఖాతాల్లో వేగమే దీనికి నిదర్శనం. 


2023 మే నెలలో, స్టాక్‌ మార్కెట్‌లో కొత్తగా దాదాపు 2.1 మిలియన్ల (21 లక్షలు) డీమ్యాట్ ఖాతాలు ఓపెన్‌ అయ్యాయి. స్టాక్ మార్కెట్‌కు ఇది మంచి సంకేతం.


2023లో ఇప్పటి వరకు చూస్తే, 21 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్లను జోడించిన మే నెల, అత్యధిక డీమ్యాట్ ఖాతాలు ఉన్న నెలగా నిలిచింది. దీనిని బట్టి, మొత్తం 2023 సంవత్సరంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరగవచ్చని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌లు అంచనా వేస్తున్నారు.


11.81 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు
మే నెలలో యాడ్‌ అయిన 21 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్లతో కలిపి, దేశంలోని మొత్తం డీమ్యాట్ ఖాతాలు 118.16 మిలియన్లకు (11.81 కోట్లు) చేరుకున్నాయి. ఇది, ఏప్రిల్‌ నెలతో పోలిస్తే 1.8 శాతం పెరుగుదల. మరోవైపు గతేడాది మే నెలతో పోలిస్తే 25 శాతం వృద్ధి. 2023 ఏప్రిల్‌లో, దేశంలో డీమ్యాట్ ఖాతాల ఓపెనింగ్‌ రేట్‌ తగ్గింది, స్లో రేట్‌ నమోదు చేసింది. NSDL, CDSL డేటా ప్రకారం, 2023 ఏప్రిల్‌లో 16 లక్షల డీమ్యాట్ ఖాతాలు ఓపెన్‌ అయ్యాయి. 2020 డిసెంబర్ తర్వాత, అత్యల్పంగా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమైన నెల ఇదే. 


డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరగడం వెనుక రిటైల్‌ ఇన్వెస్టర్లు ఉన్నారు. భారతీయ స్టాక్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడమే ఈ ఉత్తేజానికి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గత రెండు నెలల్లో స్టాక్ మార్కెట్‌లో మంచి రాబడులు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. ఇది, రిటైల్ పార్ట్‌నర్‌షిప్‌ను ప్రోత్సహించింది. 


దేశీయ స్టాక్ మార్కెట్ పనితీరును పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో భారత మార్కెట్ గ్లోబల్ మార్కెట్‌ను 4 శాతం వృద్ధితో ఔట్‌-పెర్ఫార్మ్‌ చేసింది. అంటే ప్రపంచ మార్కెట్ల కంటే 4 శాతం ఎక్కువ రాబడిని ఇండియన్‌ మార్కెట్‌ ఇచ్చింది. మే నెలలో, ఈ రాబడి 3 శాతం ఎక్కువగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత కొన్ని నెలలుగా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల, ఆ పాజిటివ్‌ ఎఫెక్ట్‌ స్టాక్ మార్కెట్ పై కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ర్యాలీని అందుకోవడానికి కొత్త పెట్టుబడిదార్లు మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నారు, డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్‌ చేస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: పూర్తి ఉచితంగా ఆధార్‌ అప్‌డేషన్‌, కొన్ని రోజులే ఈ ఆఫర్‌ 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.