IIFL Securities Share Price: క్లయింట్లు దాచుకున్న డబ్బులను అక్రమంగా దారి మళ్లించిన విషయంలో, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI), బ్రోకరేజ్ కంపెనీ ఐఐఎఫ్ సెక్యూరిటీస్ మీద సెబీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంది. రెండేళ్ల వరకు కొత్త క్లయింట్స్‌ను చేర్చుకోకుండా నిషేధం విధించింది. దీంతో ఇవాళ్టి (మంగళవారం, 20 జూన్ 2023) ట్రేడ్‌లో, BSEలో, IIFL సెక్యూరిటీస్ షేర్లు ఒక్కసారిగా 19% పతనమై రూ. 58కి పడిపోయాయి.
సోమవారం రూ. 71.15 దగ్గర క్లోజయిన ఈ స్క్రిప్, ఇవాళ భారీ గ్యాప్-డౌన్‌తో రూ. 59 దగ్గర ఓపెన్ అయింది. ఆ వెంటనే రూ. 58 స్థాయికి పడిపోయింది.
ఖాతాదార్ల బ్యాంక్ అకౌంట్లకు సరైన మార్కింగ్ లేకపోవడంతో, IIFL సెక్యూరిటీస్ మీద సెబీ జరిమానా కూడా విధించింది.
సెబీ ఆర్డర్‌లో ఉన్న విషయాలు ఇవి
IIFL, సెబీ నిబంధనలను గత 25 ఏళ్లుగా చిత్తశుద్ధితో పాటించలేదని రెగ్యులేటర్ తేల్చింది. క్లయింట్స్ డబ్బును ఇతర వ్యాపారాల కోసం వాడుకుందని సోమవారం రిలీజ్ చేసిన ఆర్డర్‌లో పేర్కొంది.
2011 ఏప్రిల్ నుంచి 2014 జూన్ వరకు జరిగిన వరుస తనిఖీల్లో రూల్స్ వయోలేషన్స్ గుర్తించినట్లు సెబీ తెలిపింది. మళ్లీ, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 2017 మార్చిలో జరిగిన తనిఖీల సమయంలో ఉల్లంఘనలు గమనించింది. "రూల్స్ బ్రేకింగ్‌కు సంబంధించి ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌ను హెచ్చరించినప్పటికీ, తప్పులను సరిదిద్దుకోవడానికి బ్రోకరేజ్ కంపెనీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తూ దొరికిపోయింది”అని సెబీ హోల్‌టైమ్ మెంబర్ ఎస్‌కె మొహంతి తన ఆర్డర్‌లో చెప్పారు.
ఆరు సంవత్సరాలకు పైగా లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత, IIFL సెక్యూరిటీస్‌ను దోషిగా SEBI గుర్తించింది, కొత్త ఖాతాదార్లను యాడ్ చేయకుండా నిషేధించింది.
సెబీ విధించిన నిషేధం మీద న్యాయ పోరాటానికి ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ సిద్ధమవుతోంది. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (Securities Appellate Tribunal) తలుపు తడతామని కంపెనీ ప్రకటించింది.
ఉదయం 11.40 గంటల సమయానికి, బీఎస్‌ఈలో, ఈ స్క్రిప్ 13% తగ్గి రూ. 61.81 వద్ద ట్రేడవుతోంది.
ఈ స్టాక్, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 5% క్షీణించింది, గత ఆరు నెలల్లో 8% పైగా పడిపోయింది. గత ఏడాది కాలంలో దాదాపు 6% నష్టపోయింది. స్టాక్ 52-వారాల గరిష్టం రూ. 79.65 కాగా, 52-వారాల కనిష్టం రూ. 48.23.
మరో ఆసక్తికర కథనం: ఓ చేత్తో డబ్బు తెస్తున్నారు, మరో చేత్తో ఖాతా ఖాళీ చేస్తున్నారు - ఇదేందయ్యా ఇదీ!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial