Stock Market Holidays in March 2024: భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈ నెలలోని (మార్చి 2024) మొత్తం 31 రోజుల్లో కేవలం 19 రోజులే పని చేస్తాయి, 12 రోజులు నాన్‌ ట్రేడింగ్‌ డేస్‌. అంటే, మార్కెట్లు మూడింట ఒక వంతు రోజులు సెలవుల్లో ఉంటాయి. 


ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, సగటున ప్రతి మూడు రోజుల్లో ఒక రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడే. దీంతో, అతి తక్కువ ట్రేడింగ్‌ రోజులు ఉన్న నెలల్లో ఒకటిగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి నెల నిలుస్తుంది. 


ఈ నెలలో మహా శివరాత్రి, హోలీ, గుడ్‌ ఫ్రైడే
ఈ నెలలో రెండు పెద్ద పండుగలు, ఒక సంతాప దినం ఉన్నాయి. ఆ సందర్భాల వల్ల నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (NSE), బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE) పని చేయవు. మన దేశంలోని ప్రధాన పండుగల్లో ఒకటైన మహా శివరాత్రి మార్చి 08న వచ్చింది. మార్చి 25న హోలీ (ధులెండి) ఉంది. సంతాప దినమైన గుడ్ ఫ్రైడే ఈ నెలాఖరులో వచ్చింది. 


మార్చి 08 నుంచి లాంగ్‌ వీకెండ్‌
పరమ శివుడిని ఆది దేవుడిగా హిందువులు పూజిస్తారు. మహా శివరాత్రి అంటే, భోళా శంకరుడిని అర్చించేందుకు సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే వచ్చే అతి గొప్ప ముహూర్తం. ఇది, మార్చి 08న శుక్రవారం రోజున వచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా ఆ రోజున స్టాక్ మార్కెట్లు పని చేయవు. ఆ తర్వాత.. 9వ తేదీన శనివారం, 10వ తేదీన ఆదివారం ఉన్నాయి. అందువల్ల, స్టాక్ మార్కెట్లు వరుసగా 3 రోజులు సెలవు తీసుకుంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా మార్చి 8న జరుపుకుంటారు.


మార్చి 23 నుంచి మరో సుదీర్ఘ వారాంతం
రంగుల పండుగ హోలీ ఈ సంవత్సరం మార్చి 25న వచ్చింది, ఆ రోజు సోమవారం. దీనికి ముందున్న శని, ఆదివారాలు (మార్చి 23, 24 తేదీలు) కూడా సెలవులు. కాబట్టి, మార్చి నెలలో మరోమారు వరుసగా 3 రోజులు నాన్‌ ట్రేడింగ్‌ డేస్‌ ఉంటాయి. ఈ వారాంతం కూడా లాంగ్ వీకెండ్‌గా మారుతుంది.


మార్చి 29 నుంచి నెలాఖరు వరకు నాన్‌-ట్రేడింగ్‌ డేస్‌
యేసు ప్రభువును శిలువ వేసిన జ్ఞాపకార్థం, సంతాప దినంగా పరిగణించే గుడ్‌ ఫ్రైడే మార్చి 29న ఉంది. ఈ రోజున ఏసుక్రీస్తును శిలువ వేశారని నమ్ముతారు. ఆ రోజు గ్లోబల్ మార్కెట్లు కూడా మూతబడతాయి. అమెరికన్ మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లకు కూడా సెలవు ఉంటుంది. దీని తర్వాత వచ్చే శని, ఆదివారాలను కూడా కలుపుకుంటే, వరుసగా.. మార్చి 29, 30, 31 తేదీల్లో మార్కెట్‌కు సెలవులు ఉంటాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో బ్యాంక్‌లకు 14 రోజులు సెలవులు, హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో