Stock Market Crash: ప్రపంచ వార్తలు & దేశీయ విషయాలు కలిసి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో ఈ రోజు (మంగళవారం, 21 జనవరి 2025) భారత బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ &నిఫ్టీ 1 శాతానికి పైగా పతనమయ్యాయి. బీఎస్ఇ సెన్సెక్స్ 1,235.08 పాయింట్లు లేదా 1.60% నష్టంతో 75,838.36 వద్దకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 299.45 పాయింట్లు లేదా 1.28% క్షీణించి 23,045.30 వద్ద ముగిసింది. 


మార్కెట్‌ ముగియడానికి దాదాపు ముప్పావు గంట ముందు, సెన్సెక్స్ 1,400 పాయింట్లకు పైగా జారిపోయింది, 76,000 స్థాయిని వదిలేసింది. అదే సమయంలో NSE నిఫ్టీ 350 పాయింట్లకు పైగా క్షీణించి 23,000 మార్క్‌ను కోల్పోయింది. జూన్ 07, 2024 తర్వాత నిఫ్టీ 23,000 కంటే దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. ట్రేడింగ్‌ చివరిలో షార్ట్స్‌ కవరింగ్‌ కారణంగా రెండు ప్రధాన ఇండెక్స్‌లు స్వల్పంగా కోలుకున్నాయి.


అమ్మకాల తీవ్రత
ఈ రోజు సెన్సెక్స్‌ను గట్టిగా ముంచింది ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో షేర్లు. ఫియర్ ఇండెక్స్ ఇండియా VIX 6% పైగా పెరిగి 17.45కి చేరుకుంది, సమీప కాలంలో అధిక అస్థిరతను అది సూచిస్తోంది.


బ్రాడర్‌ మార్కెట్‌లో అమ్మకాలు తీవ్రంగా ఉన్నాయి. నిఫ్టీ స్మాల్‌ క్యాప్ 100 ఇండెక్స్‌ 2.28%, నిఫ్టీ మిడ్‌ క్యాప్ 100 ఇండెక్స్‌ 2.38% & నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్‌ 1.94% చొప్పున పడిపోయాయి.


ట్రంప్‌ వ్యాఖ్యలు
మార్కెట్‌ పతనానికి ఒక కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. బ్రిక్స్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లలోకి షాక్ వేవ్స్‌ పంపాయి. సోమవారం, వాణిజ్యం కోసం అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దేశాలపై 100 శాతం సుంకాలను విధించాలన్న తన ప్రణాళికను ట్రంప్‌ మళ్లీ ప్రస్తావించారు. ఓవల్ కార్యాలయం నుంచి మాట్లాడిన ట్రంప్‌, "బ్రిక్స్ కూటమి దేశంగా డీ-డాలరైజేషన్ ప్రయత్నాలను కొనసాగించాలని ఆలోచిస్తే 100% సుంకాన్ని ఎదుర్కొంటారు" అని హెచ్చరించారు.


Q3 ఫలితాలు
మిశ్రమ కార్పొరేట్ ఆదాయాలు పెట్టుబడిదారుల ఆందోళనను మరింత పెంచాయి. డిసెంబర్ త్రైమాసికానికి ‍‌(Q3 FY25) ఏకీకృత నికర లాభం & ఆదాయంలో QoQ క్షీణతను నివేదించిన డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు 14 శాతం షార్ప్‌గా పడిపోయాయి. ఫుడ్‌ డెలివెరీ కంపెనీ జోమాటో కూడా 9 శాతం నష్టపోయింది. దీని Q3 ఫలితాలపై బ్లింకిట్ విస్తరణ ప్రభావం చూపుతోంది. రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌లో... మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయిన ఒబెరాయ్ రియాల్టీ, Q3 ఫలితాలను పోస్ట్ చేసిన తర్వాత 7.6 శాతం పడిపోయింది.


జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ అంచనా ప్రకారం, నిఫ్టీ 23,140 వద్దకు చేరుకున్నప్పటికీ, ఇంకా పైకి ఎగబాకాలంటే 23,370/90 దగ్గర రెసిస్టెన్స్‌ను బద్ధలు కొట్టాలి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నిఫ్టీలో అంత వేగం, బలం లేదని ఆనంద్ జేమ్స్ చెబుతున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మీ క్రెడిట్‌ కార్డ్‌ను ఇలా వాడండి - ఈ ప్రయోజనాలన్నీ సొంతం చేసుకోండి!