Hinduja Chairman Death: హిందూజా గ్రూప్ ఛైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో 87 ఏళ్ల వయస్సులో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 'హిందూజా కుటుంబ పెద్ద, హిందూజా గ్రూప్ ఛైర్మన్ ఎస్పీ హిందూజా బుధవారం (మే 17) మృతి చెందారని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం. దివంగత పీడీ హిందూజా వ్యవస్థాపక సూత్రాలు, విలువలను కొనసాగించి ఎస్పీ హిందూజా మా కుటుంబానికి మార్గదర్శకుడిగా నిలిచారు. స్వదేశమైన భారత్, తాను ఉంటున్న యూకే మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంలో తన సోదరులతో కలిసి కీలకమైన పాత్ర పోషించారు' అని హిందూజా కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎస్పీ హిందూజా మరణం పట్ల ఆయన సోదరులు గోపిచంద్, ప్రకాశ్, అశోక్ హిందూజాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిందూజా బ్రదర్స్ నలుగురిలో ఎస్పీ హిందూజా పెద్ద వారు. 1935 నవంబర్ 28వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్ లోని కరాచీలో జన్మించారు ఎస్పీ హిందూజా. ఎస్పీ హిందూజాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఎస్పీ హిందూజా సతీమణి మధు కన్నుమూశారు.
ఇండస్ ఇండ్ బ్యాంక్ నెలకొల్పడంలో కీలక పాత్ర
ఆయన పూర్తి పేరు శ్రీచంద్ పి. హిందూజా, తన వ్యాపార సహచరులు, స్నేహితులు ఆయనను ఎస్పీ అని పిలుస్తారు. అలా ఎస్పీ హిందూజా అనే పేరుతో సుపరిచితులు అయ్యారు. 1952 లో చదువు పూర్తి చేసిన తర్వాత ఎస్పీ.. తన తండ్రి పీడీ హిందూజాతో కలిసి కుటుంబ వ్యాపారంలో చేరారు. పీడీ హిందూజా తర్వాత హిందూజా గ్రూప్ కు అధిపతిగా మారారు. హిందూజా గ్రూప్ తో పాటు దాని స్వచ్ఛంద సంస్థలకు ఛైర్మన్ అయ్యారు. సోదరులు గోపీచంద్, ప్రకాశ్, అశోక్ హిందూజాలతో కలిసి హిందూజా గ్రూప్ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఆసియా, మిడిల్ ఈస్ట్, యూరప్, అమెరికాల్లో వ్యాపారాలు నెలకొల్పి ఆయా ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ప్రైవేట్ బ్యాంక్ అయిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు.
గ్రూప్ అభివృద్ధి కోసం ఒక్కొక్క సోదరుడు ఒక్కో చోట
15.2 బిలియన్ డాలర్ల నికల విలువ కలిగి సంస్థ హిందూజా గ్రూప్. ఈ గ్రూప్ నిర్వహించే వ్యాపార కార్యకలాపాల్లో ట్రక్కులు, లూబ్రికెంట్లు, బ్యాంకింగ్, కేబుల్ టెలివిజన్ వంటివి ఉన్నాయి. రాఫెల్స్ హోటల్ గా మారబోతున్న ఓల్డ్ వార్ ఆఫీస్ భవనంతో సహా లండన్‌లో విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులు హిందూజా సొంతం. శ్రీచంద్, గోపిచంద్ లండన్ లో ఉంటున్నారు. ప్రకాష్ మొనాకోలో నివసిస్తుంటారు. చిన్న సోదరుడు అశోక్ ముంబైలో ఉంటూ భారత వ్యాపార ప్రయోజనాలను పర్యవేక్షిస్తుంటారు.
వివాదాల్లోనూ హిందూజా సోదరులు!
బోఫోర్స్ కుంభకోణంలో హిందూజా సోదరుల పేర్లు తెరపైకి వచ్చాయి. గోపీచంద్, ప్రకాష్ ఇద్దరూ ఈ కాంట్రాక్ట్ స్వీడిష్ గన్ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ కు వచ్చేలా 81 మిలియన్ల స్వీడన్ కరెన్సీని అక్రమ కమీషన్లుగా అందుకున్నారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత వాటిని కోర్టు కొట్టివేసి హిందూజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించింది.