Silver price crashes Rs 21000:  కేవలం ఒక గంట వ్యవధిలోనే వెండి ధర కిలోకు రూ. 21,000 కు పైగా పతనమవ్వడం మార్కెట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. 2025లో ఇప్పటివరకు అప్రతిహతంగా దూసుకుపోతూ, కిలో రూ. 2.50 లక్షల మార్కును దాటిన వెండి ధరలో ఈ అకస్మాత్తు పతనం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.  

Continues below advertisement

గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. సోమవారం మధ్యాహ్నం సెషన్‌లో ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. కిలో వెండి ధర రికార్డు స్థాయి రూ. 2,54,174 నుండి కేవలం ఒక గంటలోనే రూ. 21,000 తగ్గి రూ. 2,33,120 కనిష్టానికి పడిపోయింది.  వెండి ధర పడిపోవడానికి తక్షణ కారణం భౌగోళిక రాజకీయాల్లో వచ్చిన మార్పులే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగినట్లు వార్తలు వచ్చాయి.  ఒప్పందానికి మేము చాలా దగ్గరగా ఉన్నాము అని ట్రంప్ చేసిన ప్రకటనతో, యుద్ధం ముగుస్తుందనే ఆశలు చిగురించాయి. దీనివల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి పై ఇన్వెస్టర్లకు ఆసక్తి తగ్గి, అమ్మకాలు పెరిగాయి.  2025 సంవత్సరంలో వెండి ఏకంగా  180 శాతం లాభాలను  అందించింది. బంగారం   70-80 శాతం మాత్రమే పెరగగా, వెండి మాత్రం అంచనాలకు మించి దూసుకెళ్లింది. కిలో ధర రూ. 2.5 లక్షల మైలురాయిని దాటడంతో, ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడంతో ధరలు భారీగా క్షీణించాయి.         

  మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, వెండి ధరల పెరుగుదల  గరిష్ట దశకు చేరుకుందని.. సాధారణంగా ఇలాంటి పెరుగుదలలు చివరికి భారీ పతనానికి దారితీస్తాయని చరిత్ర చెబుతోందని గుర్తు చేస్తున్నారు. సాంకేతికంగా చూస్తే, వెండి తన 200 రోజుల సగటు ధర  కంటే 89 శాతం ఎగువన ట్రేడ్ అవుతోంది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ ధరలు 25  నుండి 50 శాతంవరకు పడిపోయిన దాఖలాలు ఉన్నాయి.                                                                   వెండి ధరలు భారీగా పడిపోయినప్పటికీ, దీర్ఘకాలంలో పారిశ్రామిక డిమాండ్   కారణంగా ధరలు మళ్లీ పుంజుకుంటాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న అనిశ్చితి నేపథ్యంలో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.