Banks, LIC Offices Works on Sunday: ఈ రోజు ఆదివారమైనా (మార్చి 31) బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ ఆఫీసులు పని చేస్తాయి. ఆదాయ పన్ను కార్యాలయాలకు కూడా ఈ రోజు సెలవు లేదు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రోజు చివరి రోజు కాబట్టి, సంవత్సరాంతం లోగా పూర్తి చేయాల్సిన పనుల కోసం ప్రజలకు ఈ అవకాశం కల్పించారు. ఆదివారం కూడా అన్ని ఏజెన్సీ బ్యాంక్‌ల శాఖలు తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ గతంలోనే ఆదేశించింది. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులతో సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌తో సహా అన్ని ప్రధాన బ్యాంకులు ఈ రోజు పని చేస్తాయి. సాధారణ పని గంటల్లో సేవలు అందిస్తాయి.
ఈ రోజు అందే బ్యాంక్ సేవలు
ఈ రోజు అర్ధరాత్రి వరకు... నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) పని చేస్తాయి. చెక్ క్లియరింగ్ సేవలు కూడా ఈ రోజు కొనసాగుతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర (KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాల్లో కనీస డిపాజిట్ చేయడానికి ఇదే చివరి రోజు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేందుకు కూడా ఆదివారమే ఆఖరు. కాబట్టి, వీటికి సంబంధించిన లావాదేవీలను బ్యాంకుల్లో అనుమతిస్తారు.
కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి రోజున (సోమవారం, 01 ఏప్రిల్ 2024) మాత్రం బ్యాంక్‌లు సాధారణ లావాదేవీలు నిర్వహించవు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఖాతాలను ముగించే పనిలో బిజీగా ఉంటాయి.
స్వాగతం పలకనున్న ఎల్‌ఐసీ ఆఫీసులు
దేశంలో అతి పెద్ద బీమా కంపెనీ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఆఫీసులు ఆదివారం కూడా మీకు స్వాగతం పలుకుతాయి. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆదివారం నాడు అన్ని కార్యాలయాలను తెరిచి ఉంచాలని LIC నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఏ పనైనా చివరి రోజులో పూర్తి చేయడంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా LIC ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ రోజుల మాదిరిగానే, సాధారణ పని గంటల ప్రకారం పని చేస్తాయి. ఎల్‌ఐసీకి సంబంధించిన ఏదైనా పని పూర్తి చేయాల్సి వస్తే, మీరు ఈ రోజు కూడా ఎల్‌ఐసీ ఆఫీస్‌కు వెళ్లొచ్చు.
ఎల్‌ఐసీ పాటు చాలా బీమా కంపెనీలు కూడా ఈ ఆదివారం నాడు పని చేస్తాయి.
ఆదాయ పన్ను కార్యాలయాలు కూడా..
ఆదాయ పన్ను విభాగం కార్యాలయాలు కూడా ఈ రోజు తెరిచి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదార్లు ఇంకా ఏదైనా పని పూర్తి చేయాల్సి ఉంటే, ఆదివారం నాడు కూడా ఆ పనిని పూర్తి చేయవచ్చు. లేదా, ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌కు వెళ్లాల్సివస్తే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.
మరో ఆసక్తికర కథనం: రూ.5 లక్షల పెట్టుబడికి రూ.43,000 వడ్డీ, ఈ రోజే లాస్ట్ ఛాన్స్- ఆలస్యానికి ఆశాభంగం