Bajaj Finance Shares: గత దశాబ్ద కాలంలో, ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌లో అతి పెద్ద మల్టీ బ్యాగర్ అయిన బజాజ్ ఫైనాన్స్ స్టాక్, గురువారం ట్రేడింగ్ సెషన్‌లో (05 జనవరి 2023) తలక్రిందులైంది. ఈ ఒక్క రోజులో, బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర దాదాపు 8 శాతం, అంటే రూ. 500 పైగా పడిపోయింది. 


నిన్న (బుధవారం, జనవరి 4, 2022)‌, బజాజ్ ఫైనాన్స్ షేర్ రూ. 6,571 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్ ప్రారంభంలోనే రూ. 6,032 స్థాయికి పడిపోయింది. ఇవాళ ఒక్క రోజే, బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లు రూ. 30,000 కోట్ల నష్టాన్ని చవిచూశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో స్టాక్ క్రాష్ తర్వాత, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ ( మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) రూ. 3.68 లక్షల కోట్లకు పడిపోయింది.


స్టాక్ క్రాష్ ఎందుకు?
2022 మూడో త్రైమాసికం (అక్టోబర్ - డిసెంబర్ కాలం) కోసం, బజాజ్ ఫైనాన్స్ విడుదల చేసిన అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) లెక్క మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉంది. దీంతో పెట్టుబడిదారుల్లో నిరాశ పెరిగి స్టాక్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. 


ఈ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన సమాచారం (ఎక్సేంజ్‌ ఫైలింగ్‌) ప్రకారం... డిసెంబర్ 31, 2022 నాటికి, కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) గతం సంవత్సరం కంటే ఈసారి 27 శాతం (YoY) వృద్ధి చెంది రూ. 2,30,850 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 1,81,250 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో (Q2FY23) పోలిస్తే, 6 శాతం (QoQ) వృద్ధితో రూ. 12,500 కోట్లు పెరిగాయి. మూడో త్రైమాసికంలో పండుగల సీజన్ కారణంగా మార్కెట్ ఇంకా మెరుగైన గణాంకాలను అంచనా వేసింది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో 31 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరారు, ఇది కూడా ఊహించిన దాని కంటే తక్కువ. Q2FY23లో కొత్త కస్టమర్ల సంఖ్య 26 లక్షలుగా ఉంది. మొత్తం కస్టమర్‌ బేస్‌ 6.60 కోట్లకు చేరింది, YoYలో 19 శాతం పెరిగింది. కస్టమర్‌ చేరికలు ఆరోగ్యవంతంగానే ఉన్నా, మార్కెట్‌ అంచనాల కంటే తక్కువగా రావడమే స్టాక్‌లో బలహీనతకు కారణమైంది.


అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్
ఈ స్టాక్ పెట్టుబడిదారులకు ఇష్టమైన స్టాక్. రెండు దశాబ్దాల క్రితం, 2003 జనవరిలో ఈ షేరు ఒక్కో షేరు రూ.5 కంటే తక్కువ ధరలో ట్రేడవుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దశాబ్దం క్రితం, 2013 జనవరిలో ఈ స్టాక్ రూ. 134 వద్ద ఉంది.  కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో, స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం సంభవించినప్పుడు, ఈ స్టాక్ ధర రూ. 1800 వద్దకు దిగి వచ్చింది. 2022లో, ఈ షేర్ రూ. 8,045 రికార్డు స్థాయిని కూడా తాకింది. ప్రస్తుతం రూ. 6,110 వద్ద ట్రేడవుతోంది.


20 ఏళ్లలో స్టాక్ 1214  రెట్ల రాబడి
బజాజ్ ఫైనాన్స్ స్టాక్ గత 20 ఏళ్లలో పెట్టుబడిదారులకు 1,21,400 శాతం రాబడిని ఇచ్చింది. అంటే రెండు దశాబ్దాల్లో ఈ షేర్ 1214 రెట్లు పెరిగింది. గత ఒక దశాబ్దంలో, స్టాక్ దాని పెట్టుబడిదారులకు 4400 శాతం రాబడిని ఇచ్చింది. కరోనా మహమ్మారి సమయంలోని తక్కువ స్థాయి నుంచి పుంజుకుని, ఇప్పటివరకు పెట్టుబడిదారులకు 237 శాతం రాబడిని అందించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.