Adani Wilmar Shares: ఫార్చ్యూన్‌ (Fortune) బ్రాండ్‌తో వంట నూనెలు, ఇతర ఆహార పదార్థాలను మార్కెట్‌ చేస్తున్న అదానీ విల్మార్ లిమిటెడ్‌ (Adani Wilmar Ltd - AWL) కంపెనీ షేర్లు ఇవాళ్టి (గురువారం) ఇంట్రా డే ట్రేడ్‌లో 4 శాతం వరకు నష్టపోయాయి. మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి 3.14 శాతం లేదా రూ. 22.25 నష్టంతో రూ. 686.20 దగ్గర షేర్లు కదులుతున్నాయి.


పతనానికి కారణం
షేర్ల పతనానికి కారణం.. స్టాక్‌ ఎక్సేంజీలకు ఈ కంపెనీ సమర్పించిన బిజినెస్‌ అప్‌డేట్‌ రిపోర్ట్స్‌. ఎడిబుల్ ఆయిల్ రేట్ల తగ్గుదల వల్ల జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 'లో సింగిల్ డిజిట్‌'లో వృద్ధి చెందుతుందని ఆ రిపోర్ట్స్‌లో పేర్కొన్న అదానీ విల్మార్‌, స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు షాక్‌ ఇచ్చింది. 


దేశీయ & ప్రపంచ స్థాయి సూచనలు, కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ప్రతిష్టంభన, పెరుగుతున్న వడ్డీ రేట్లు, గ్రామీణ డిమాండ్‌ వృద్ధిలో మందగమనం, దేశంలో రుతుపవనాల తిరోగమనంలో ఆలస్యం వంటి సవాళ్లు గత త్రైమాసికంలో (Q2FY23) వ్యాపారాన్ని ప్రభావితం చేశాయని బిజినెస్‌ అప్‌డేట్‌లో ఈ కంపెనీ వెల్లడించింది.


రికవరీ సంకేతాలు 
అయితే, రికవరీ కోసం కొన్ని సానుకూల సంకేతాలను కూడా కంపెనీ చూస్తోంది. కమోడిటీ ధరలు తగ్గడం, FY22లో పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి వంటివి సానకూలాంశాలు. రెండో త్రైమాసికంలో అధిక ద్రవ్యోల్బణం షాక్‌లు తప్పలేదు. ఇప్పుడు ధరలు తగ్గాయి కాబట్టి, అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీ తెలిపింది.


ప్రస్తుతం, పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ వంటి ఎడిబుల్ ఆయిల్స్ ధరలు తగ్గాయి. దాదాపుగా కోవిడ్‌కు ముందున్న స్థాయుల్లోకి చేరాయి.


FY23 మొదటి అర్ధభాగంలో (H1FY23) కంపెనీ ఆదాయాలు, వాల్యూమ్స్‌ 'లో డబుల్‌ డిజిట్‌' గ్రోత్‌ను నమోదు చేయవచ్చని కంపెనీ భావిస్తోంది. పండుగలు, ఆహార పదార్థాల ధరలు తగ్గడం వంటి కారణాలతో, ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో (H2FY23) వినియోగం పెరగవచ్చని ఆశిస్తోంది.


ప్రైస్‌ ట్రెండ్స్‌
గత ఆరు నెలల్లో, S&P BSE సెన్సెక్స్‌లోని 1.9 శాతం క్షీణతతో పోలిస్తే, ఈ స్క్రిప్‌ 8 శాతం లాభపడింది. అంటే, కష్టకాలంలోనూ ఎదురీది దమ్ము చూపించింది. అయితే, గత నెల రోజుల కాలంలో దాదాపు 5 శాతం పడిపోయింది. 


ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ కౌంటర్‌ ఒకటిన్నర రెట్లకు పైగా లాభపడింది. రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర పైగా లాభం తెచ్చి పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 265 దగ్గరున్న షేరు ధర ఇవాళ మధ్యాహ్నానికి రూ. 686.20 దగ్గరు చేరింది. ఈ తొమ్మిదిన్నర నెలల కాలంలో రూ. 421 లేదా 158.75 శాతం పెరిగింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.