Adani Group Shares Crash: అదానీ గ్రూప్‌ ఓనర్‌ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై (Gautam Adani) అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు లంచం ఆరోపణలు నమోదు చేయడంతో అదానీ గ్రూప్ స్టాక్స్ ఈ రోజు (గురువారం, 21 నవంబర్‌ 2024) విలవిల్లాడాయి, భారీ నష్టాలను చవిచూశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprise), అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ (Adani Green Energy) సహా ప్రధాన గ్రూప్ సంస్థల షేర్లు ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో 10 శాతం నుంచి 20 శాతం క్షీణించాయి.


ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ 10 శాతం పతనమై, రూ.2,539.35 వద్ద లోయర్ సర్క్యూట్‌లో లాక్‌ అయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనంతర కనిష్ట స్థాయుల నుంచి గణనీయంగా కోలుకున్నప్పటికీ, ప్రస్తుతం ఈ స్టాక్ దాని గత గరిష్టాలకు దూరంగానే ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 17 శాతం క్షీణించి రూ. 1,172.50కి చేరుకోగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ (Adani Energy Solutions) 20 శాతం పడిపోయి రూ. 697.25 వద్దకు చేరుకుంది.


అదానీ గ్రూప్‌ ATMగా భావించే అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ (Adani Ports), గ్రూప్‌లోని సిమెంట్‌ కంపెనీలు ACC, అంబుజా సిమెంట్స్‌ (Ambuja Cements) సహా ఇతర గ్రూప్ స్టాక్స్‌ కూడా 20 శాతం వరకు నష్టాలతో లోయర్ సర్క్యూట్‌లను తాకాయి. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, NDTV, అదానీ విల్మార్, సంఘీ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు 10 శాతం - 20 శాతం మధ్య విలువ తగ్గాయి. గ్రూప్ కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 14.28 లక్షల కోట్ల నుంచి 12.42 లక్షల కోట్లకు తగ్గింది. అదానీ గ్రూప్‌లో ఆపద్బాంధవ పెట్టుబడిదారు, అమెరికాకు చెందిన GQG పార్టనర్స్‌ షేర్లు కూడా 25 శాతం పతనమైనట్లు CNBC రిపోర్ట్‌ చేసింది.


ఈ పతనానికి కారణమేంటి?
భారతదేశంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్‌ సహా ఏడుగురు $250 మిలియన్ల (రూ. 2,100 కోట్లు) లంచాన్ని అధికారులకు ఆఫర్‌ చేశారంటూ.. అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్‌ కోర్టు అభియోగాలు మోపింది. పెట్టుబడిదార్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించింది. ఇది, అదానీ గ్రూప్‌ షేర్లలో భారీగా అమ్మకాలకు దారితీసింది. నిందితులు US పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు చేశారని, ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారని అభియోగపత్రంలో ఆరోపించారు.


దాదాపు రెండేళ్ల క్రితం.. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలపై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) రిపోర్ట్‌ ఇచ్చిన షాక్‌ నుంచి అదానీ గ్రూప్‌ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇప్పుడు వచ్చిన తాజా అభియోగాలు పెట్టుబడిదారుల్లో ఆందోళనలు రేకెత్తించాయి.


గురువారం, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు కూడా ఉదయం ట్రేడింగ్‌లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయానికి, బీఎస్‌ఇ సెన్సెక్స్ 470 పాయింట్లు క్షీణించి 77,108 వద్ద, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 173  పాయింట్లు క్షీణించి 23,345 వద్ద ట్రేడవుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ