RSIL KV Kamath: భారత దేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌ను ‍‌(KV Kamath) కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది. 5 సంవత్సరాల పదవీ కాలానికి ఆయన్ను అప్పాయింట్‌ చేసింది. శుక్రవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 


స్వతంత్ర డైరెక్టర్‌ పదవితో పాటు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పూర్తి యాజమాన్యంలో ఉన్న రిలయన్స్‌ స్ట్రాటెజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ (RSIL) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా కేవీ కామత్‌ నియమితులయ్యారు. రిలయన్స్‌ చేస్తున్న ఫైనాన్స్‌ వ్యాపారాన్ని రిలయన్స్ స్ట్రాటెజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌లో కలిపి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌గా (JFSL) దాని పేరు మార్చనున్నారు. కొత్త పేరుతో స్టాక్‌ మార్కెట్‌లోనూ లిస్ట్‌ చేయనున్నారు. 


రిలయన్స్‌ నుంచి ఫైనాన్స్ వ్యాపారాన్ని విడదీయడం (డీమెర్జర్‌) పూర్తయిన తర్వాత, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్‌గా కామత్ బాధ్యతలు స్వీకరిస్తారు.


కామత్‌ గురించి..
బ్యాంకర్‌గా కేవీ కామత్‌ సుప్రసిద్ధుడు. IIM అహ్మదాబాద్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ తీసుకున్నారు. 1971లో ICICI బ్యాంక్‌లో కెరీర్‌ ప్రారంభించారు. ICICI బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, వ్యవస్థాపక CEOగా ఉన్నారు. 1988లో ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు (ADB) మారారు. 1996లో ICICI బ్యాంక్‌కు తిరిగి వచ్చి, మేనేజింగ్ డైరెక్టర్ & CEOగా ఛార్జ్‌ తీసుకున్నారు. 2009 ఏప్రిల్‌లో అక్కడ పదవీ విరమణ చేశారు.


ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) ఛైర్మన్‌గానూ కామత్‌ పని చేశారు. 2011లో ఎన్‌.ఆర్‌. నారాయణ మూర్తి చైర్మన్‌ పదవి నుంచి వైదొలగగా, కేవీ కామత్‌ ఆ కంపెనీ చైర్మన్‌గా 2015 వరకు కొనసాగారు. 2015లో బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ మొదటి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అక్కడే, 2020లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (NaBFID) ఛైర్మన్‌గా ఉన్నారు.


భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'పద్మభూషణ్', 2008లో కామత్‌కు లభించింది.


జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 
తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేరిట విడదీసి, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ చేయనున్నట్లు గత నెల ఫలితాల ప్రకటనతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ వాటాదారులు ప్రతి రిలయన్స్ షేర్‌కు ఒక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ షేరును పొందుతారు. ప్రస్తుతం RSILగా కొనసాగుతున్న కంపెనీ ఒక నాన్ డిపాజిట్ NBFC (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ). 


స్టాక్ మార్కెట్‌ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతి పెద్ద కంపెనీ. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.17.54 లక్షల కోట్లు. శుక్రవారం, రిలయన్స్ షేరు 1.47 శాతం లాభంతో రూ. 2592.75 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.