Reliance Industries Metro: భారత దేశంలో, రిటైల్ రంగంలో తన లీడర్ పొజిషన్‌లో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్. తన ఆధిపత్యాన్ని పటిష్ట పరుచుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోని ముఖేష్ అంబానీ కంపెనీ, కొత్త అవకాశాలు సైతం సృష్టించుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా, ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ చేతికి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (Reliance Retail Ventures Limited) పగ్గాలు వచ్చాక దూకుడు బాగా పెరిగింది. ఆర్గానిక్, ఇన్- ఆర్గానిక్ మార్గాల్లో వ్యూహాలకు పదును పెట్టి బిజినెస్ విస్తరించుకుంటూ వెళ్తోంది. ఆ వ్యూహాల్లో ఒక భాగమే మెట్రో (Metro AG) హోల్‌సేల్ వ్యాపారాన్ని కొనడం.
రూ. 2,850 కోట్ల బేరం
భారతదేశంలో జర్మన్ సంస్థ నిర్వహిస్తున్న Metro AG హోల్‌సేల్ వ్యాపారాన్ని (మెట్రో క్యాష్ అండ్ క్యారీ) రూ. 2,850 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయబోతోంది. ఇందుకోసం కచ్చితమైన ఒప్పందం (definite deal) మీద ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. కచ్చితమైన ఒప్పందం అంటే.. ధర, ఇతర అంశాల్లో చిన్నపాటి మార్పులు జరిగినా, పరస్పర అంగీకారంతో ఆ ఒప్పందాన్ని కచ్చితంగా పూర్తి చేస్తాయి. కొత్త సంవత్సరంలో (2023) మార్చి నాటికి ఈ లావాదేవీ పూర్తి కావచ్చని అంచనా.
నగరాల్లో ఉండేవాళ్లకు మెట్రో గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దీనిది హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్. అంటే.. కుటుంబ అవసరాల కోసం సరుకులు కొనేవాళ్లకు కాకుండా... చిన్న, పెద్ద కిరాణా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, కంపెనీలు, ఆఫీసులు వంటి వాటికి మాత్రమే హోల్‌సేల్ ధరలకు ఇది సరుకులు అమ్ముతుంది. ఇందుకోసం, ఆయా దుకాణ యజమానుల బిజినెస్ లైసెన్స్ ఆధారంగా మెట్రో కార్డ్ జారీ చేస్తుంది. ఈ కార్డ్ ఉన్నవాళ్లకే సరుకులు అమ్ముతుంది. మెట్లో స్టోర్లలో కిరాణా సరుకులు, బట్టలు, చెప్పులు, ఎలక్ట్రాక్ వస్తువులు, గృహోపకరణాలు, స్టేషనరీ, పండ్లు, కూరగాయలు, మాంసం వంటివి టోకు ధరకు లభిస్తాయి.
ఇదీ తెర వెనుక కథ
మన దేశంలో మెట్రో బిజినెస్ 2003లో ప్రారంభమైంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని 21 నగరాల్లో 31 పెద్ద ఫార్మాట్ స్టోర్లు ఉన్నాయి. ఇందులో సగం దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. ఈ స్టోర్లలో కొనుగోళ్ల కోసం దాదాపు 30 లక్షల మంది ఖాతాదారులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 10 లక్షల మంది తరచూ కొనుగోళ్లు చేసేవాళ్లే. మెట్రోను రిలయన్స్ కొనడం వెనుక ఉన్న కిటుకు ఇదే. వీటన్నింటినీ అసంఘటిత రంగం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అసంఘటిత రంగంలో ప్రధాన భాగం రిలయన్స్ గుప్పిటలోకి వస్తుంది. వాటి మీద నియంత్రణ సాధిస్తుంది. రిలయన్స్ ఉత్పత్తులను హోల్‌సేల్‌గా ఈ లక్షలాది హోటళ్లు, రెస్టారెంట్లు, కంపెనీలు, కిరాణా దుకాణాలకు నేరుగా అమ్మవచ్చు. పైగా, రిటైల్ కిరాణా దుకాణాలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో (ఏప్రిల్-సెప్టెంబర్) మెట్రో ఇండియా రూ. 7,700 కోట్ల విలువైన సేల్స్ చేసింది. రిలయన్స్ వ్యాహాలు కూడా తోడైతే, భవిష్యత్తులో అమ్మకాల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
రిటైల్ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్, మెట్రో కొనుగోలు ద్వారా, మరో హోల్ సెల్లర్ బెస్ట్‌ప్రైస్‌కు గట్టి పోటీగా మారుతుంది. హోల్‌సేల్ సెగ్మెంట్‌లోనూ లీడర్‌గా మారేందుకు అడుగులు వేస్తోంది.