Mukesh Ambani Buys New Boeing Aeroplane: దేశంలోనే అత్యంత సంపన్నుడు & రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్‌ అంబానీ గ్యారేజ్‌లోకి మరో వెహికల్‌ వచ్చి చేరింది. గ్యారేజ్‌లోకి కొత్తగా వచ్చిన వెహికల్‌ కార్‌ మాత్రం కాదు, అది విమానం. తాజాగా, ఒక అద్భుతమైన విమానాన్ని తన ప్రైవేట్ జెట్ ఫ్లీట్‌లో చేర్చుకున్నాడీ బిలియనీర్‌. ఈ విమానం లాంటిది ప్రస్తుతం దేశంలో మరొకరి దగ్గర లేదు. దేశంలో తొలి బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాన్ని దాదాపు రూ.1,000 కోట్లకు కొనుగోలు చేశారు ముకేష్‌ అంబానీ. ఈ ఏరోప్లేన్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానాల్లో ఒకటిగా నిలిచింది.


ఒక భారతీయుడు కొన్న అత్యంత ఖరీదైన వాహనం ఇదే
బోయింగ్‌ కంపెనీ నుంచి ముకేష్ అంబానీ కొన్న ఈ విమానం ఎరోప్లేన్‌ అల్ట్రా లాంగ్ రేంజ్‌లో ఎగురుతుంది. ఒక భారతీయుడు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన వాహనం ఇదే. ఇది కాకుండా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఖాతాలో మరో 9 ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. 


బోయింగ్‌ 737 మ్యాక్స్ 9 విమానాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ముందు స్విట్జర్లాండ్‌లోని బాసెల్ మల్హౌస్ ఫ్రిబోర్గ్ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడ, ఈ బిజినెస్ జెట్‌లోని క్యాబిన్ & ఇంటీరియర్‌లో అంబానీ కోసం చాలా రకాల మార్పులు చేశారు, మరింత లగ్జరీగా తీర్చిదిద్దారు. అంతేకాదు, అక్కడ ఈ విమాన సామర్థ్యానికి చాలా రకాల పరీక్షలు కూడా నిర్వహించారు. 


ప్రస్తుతం దిల్లీలో - త్వరలో ముంబై పయనం            
ఈ విమానాన్ని ఈ ఏడాది ఆగస్టు 28న బాసెల్ నుంచి దిల్లీకి చేర్చారు. ఇది 9 గంటల్లో 6,234 కి.మీ. దూరం ప్రయాణించింది. ప్రస్తుతం, ముకేష్ అంబానీ విమానాన్ని దిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ దగ్గర పార్క్ చేశారు. త్వరలో ముంబై తీసుకెళ్లతారు. ఈ విమానం ఒకసారి గాల్లోకి ఎగిరిందంటే, మరెక్కడా ఆగకుండా 6,355 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. 


బోయింగ్, తన 737 మ్యాక్స్ 9 మోడల్‌ ఎరోప్లేన్‌ రేటును 11.85 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ. 980 కోట్లు) ప్రకటించింది. దీనిలో బేరసారాలకు అవకాశం ఉండదు. ఈ విమానం కొనుగోలు, అదనపు మార్పుల కోసం ముఖేష్ అంబానీ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు నేషనల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.


ముఖేష్ అంబానీ ఫ్లీట్‌లో విమానాలు, హెలికాప్టర్లు                          
దీనితో కలిపి, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ దగ్గర ఉన్న మొత్తం విమానాల సంఖ్య 10కి చేరింది. వీటిలో ఒకటి ఎయిర్‌బస్‌ A319 ACJ, ఇది 18 సంవత్సరాలుగా సర్వీస్‌లో ఉంది. ఇది కాకుండా.. రెండు బొంబార్డియర్ గ్లోబల్ 5000 జెట్‌లు కూడా ఉన్నాయి. బొంబార్డియర్ గ్లోబల్ 6000 జెట్, డస్సాల్ట్ ఫాల్కన్ 900S, ఎంబ్రేర్ ERJ 135, డౌఫిన్ హెలికాప్టర్, సికోర్స్కీ S76 లగ్జరీ హెలికాప్టర్ కూడా ఉన్నాయి. వీటిని తక్కువ దూరాల కోసం అంబానీ ఉపయోగిస్తారు.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు చల్లబడ్డ గోల్డ్‌, సిల్వర్‌ - మీ నగరంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవి