Benefits of Plastic Currency: భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలో కరెన్సీ నిర్వహణ ఖర్చును తగ్గించేందుకు , నోట్ల మన్నికను పెంచేందుకు విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. త్వరలోనే సాధారణ కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రవేశపెట్టాలని కేంద్ర బ్యాంకు యోచిస్తోంది. భారతదేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు ఏటా భారంగా మారుతోంది. RBI వార్షిక నివేదిక ప్రకారం, నోట్ల ముద్రణ వ్యయం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,101.4 కోట్ల నుండి రూ. 6,372.8 కోట్లకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం చిరిగిపోయిన లేదా పాడైపోయిన నోట్లను ఉపసంహరించుకుని వాటి స్థానంలో కొత్తవి ముద్రించాల్సి రావడమే. కేవలం ఒక్క ఏడాదిలోనే సుమారు 23.8 బిలియన్ల పాత నోట్లను మార్కెట్ నుండి వెనక్కి తీసుకున్నారు. ఇందులో రూ. 500. రూ. 100 నోట్లే అధికంగా ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది.
ఏమిటీ పాలిమర్ నోట్లు?
పాలిమర్ నోట్లు అంటే సింథటిక్ ప్లాస్టిక్ మిశ్రమంతో తయారయ్యే కరెన్సీ. ఇవి సాధారణ కాగితపు నోట్ల కంటే సుమారు 2.5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోవడం, తడిసిపోవడం లేదా మురికి కావడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ, ప్లాస్టిక్ నోట్లు నీటికి తడిసినా ఏమీ కావు, వీటిని అంత సులభంగా చించివేయలేము. మన్నిక ఎక్కువగా ఉండటం వల్ల వీటిని పదేపదే ముద్రించాల్సిన అవసరం ఉండదు, ఫలితంగా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ముద్రణ ఖర్చు ఆదా అవుతుంది.
భద్రతలో మేటి.. నకిలీ నోట్లకు చెక్!
ప్లాస్టిక్ నోట్లను నకిలీ చేయడం అంత సులభం కాదు. వీటిలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. పారదర్శకమైన ప్లాస్టిక్ విండోస్, లోహపు పొరలు , అతినీలలోహిత కాంతికి స్పందించే రసాయన గుర్తులు వంటివి ఉండటం వల్ల దొంగ నోట్ల బెడదను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, వియత్నాం, న్యూజిలాండ్ సహా దాదాపు 45కు పైగా దేశాలు ఈ టెక్నాలజీని విజయవంతంగా వాడుతున్నాయి.
పర్యావరణానికి మేలు.. రీసైక్లింగ్ సులభం
సాధారణ కాగితపు నోట్లు పాడైపోతే వాటిని ముక్కలు చేసి భూమిలో పూడ్చివేస్తారు . కానీ, ప్లాస్టిక్ నోట్లు వినియోగానికి పనికిరాని స్థితికి చేరినప్పుడు, వాటిని రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. వీటిని చిన్న చిన్న బిళ్లలుగా మార్చి, గార్డెన్ ఫర్నిచర్ వంటి ఇతర ప్లాస్టిక్ వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. అంటే, ఇవి ఆర్థికంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశంలో నోట్ల చలామణి చాలా వేగంగా జరుగుతుంటుంది. చేతులు మారే కొద్దీ నోట్లు త్వరగా పాడైపోతుంటాయి. ఆర్‌బీఐ ప్రవేశపెట్టనున్న ప్లాస్టిక్ నోట్లు కరెన్సీ నిర్వహణలో పెద్ద మార్పు తీసుకురానున్నాయి. త్వరలోనే ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని సమాచారం. ఇదే జరిగితే, మన పర్సుల్లో ఉండే కరెన్సీ నోట్లు ఇకపై చిరగవు, తడవవు.. మరింత కాలం సురక్షితంగా ఉంటాయి!
