RBI Governor Sanjay Malhotra | ముంబై: దసరా, దీపావళి పండుగల సమయంలో వడ్డీ రేట్లు తగ్గించి ఆర్బీఐ శుభవార్త చెబుతుందని ఆశించిన దేశ ప్రజలకు నిరాశే ఎదురైంది. కీలక రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ఉదయం మాట్లాడుతూ.. భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని బుధవారం ఉదయం వెల్లడించారు. ప్యానెల్ ఏకగ్రీవంగా కీలక రేట్లను మార్చకుండా ఉంచాలని నిర్ణయించిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
రెపో రేటు 5.5 శాతంగా కొనసాగింపు
ఈ ఎంపీసీ ప్యానెల్ రెపో రెట్లను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతం, రెపో రేటు 5.5 శాతం వద్ద ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా, RBI సోమవారం నాడు మూడు రోజుల సమీక్షను ప్రారంభించింది. మార్కెట్లు బెంచ్ మార్క్ లోన్ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. రెపో రేటు ఇప్పుడు 5.50 శాతం వద్ద ఉండగా, అందులో ఏ మార్పు చేయలేదు. వరుసగా రెండో సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 5.25 శాతంగా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు 5.75 శాతం వద్ద ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ ఊపందుకునేలా ఫిబ్రవరి 2025 నుంచి RBI ఇప్పటికే 100 బేసిస్ పాయింట్లు రేటు తగ్గించింది. ఆగస్టు పాలసీ సమావేశంలో, MPC గతంలో చేసిన కోతల తర్వాత వడ్డీ రేట్లను మార్చలేదు. పండుగల సీజన్లో వడ్డీ రేట్లు తగ్గిస్తుందని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినా నిరాశ తప్పలేదు. జీఎస్టీ తగ్గింపుతో పాటు వడ్డీ రేట్లు దిగొస్తే ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని మార్కెట్లు సైతం భావించాయి.