RBI Monetary Policy - December 2023: ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే, ఈసారి కూడా రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI Repo Rate) మార్చలేదు. ఈ కీలక రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. ఇతర కీలక రేట్లను కూడా RBI మార్చలేదు.


రెపో రేటును తథాతథంగా కొనసాగించడం వల్ల బ్యాంక్‌ రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు (bank rates), EMIల భారం పెరగవు, తగ్గవు. కాబట్టి, EMIల భారం పెరగదు, ఉపశమనం కూడా లభించదు.


ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) నేతృత్వంలో గత బుధవారం రోజున ప్రారంభమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్‌ ఈ రోజు (శుక్రవారం, 08 డిసెంబర్‌ 2023) ముగిసింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను దాస్ ప్రకటించారు.


వరుసగా ఐదోసారి 'స్టేటస్‌ కో'
డిసెంబర్‌ పాలసీలోనూ రెపో రేటును మార్చకపోవడంతో, వరుసగా ఐదోసారి కూడా పాలసీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పు చేయనట్లైంది. తదుపరి మీటింగ్‌ వరకు ఇదే రేటు అమల్లో ఉంటుంది.


2023 ఫిబ్రవరి నుంచి రెపో రేట్‌లో RBI ఎలాంటి మార్పు చేయలేదు. వచ్చే ఏడాది జూన్‌ లోపు ఇందులో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిస్ట్‌లు రిపోర్ట్‌ చేశారు. అంటే, 2024-25 రెండో త్రైమాసికం తర్వాతే ఆర్‌బీఐ పాలసీ రేట్లలో మార్పును ఆశించవచ్చు.


GDPపై రిజర్వ్ బ్యాంక్ అంచనా
రిజర్వ్ బ్యాంక్, 2024 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ (Gross Domestic Production - GDP) అంచనాను, గతంలోని 6.5 శాతం నుంచి ఇప్పుడు 7 శాతానికి పెంచింది. RBI క్రెడిట్ పాలసీలో 'విత్‌డ్రా ఆఫ్‌ అకామడేషన్‌' వైఖరిని కొనసాగించింది. ద్రవ్యోల్బణం (inflation) ఒత్తిడి తగ్గి ఆర్‌బీఐ లక్ష్యమైన 2-6 శాతానికి ఇన్‌ఫ్లేషన్‌ చేరువ కావడం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఉత్పాదక & నిర్మాణ రంగాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి కారణంగా ఆర్థిక వృద్ధి బలంగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. 


UPI విషయంలో 2 కొత్త ప్రకటనలు చేసిన దాస్‌
మొదటి ప్రకటన.. ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో ప్రతి లావాదేవీకి UPI లావాదేవీ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో UPI లావాదేవీలను ఈ నిర్ణయం మరింత సులభంగా మారుస్తుంది. ఆ రెండు రంగాలు కూడా ప్రయోజనం ఉంటుంది.


రెండో ప్రకటన... రికరింగ్‌ స్వభావం ఉన్న చెల్లింపుల కోసం ఇ-మాండేట్‌లో (e-mandate) మార్పులు చేయాలని మానిటరీ కమిటీ సిఫార్సు చేసింది. దీని కింద, రికరింగ్‌ లావాదేవీల కోసం UPI పరిమితిని, ఒక్కో లావాదేవీకి రూ. 1 లక్షకు పెంచుతారు. గతంలో ఈ లావాదేవీల సీలింగ్‌ రూ.15 వేలుగా ఉంది. కొత్త నిర్ణయం వల్ల, ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్, ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్స్‌లో రికరింగ్‌ పేమెంట్స్‌ కోసం UPI పరిమితి పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ రూ.64,000 వైపు పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి