Zero Balance Account: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సాధారణ కస్టమర్‌లకు ఉపశమనం కలిగిస్తూ, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలో భారీ మార్పులు చేసింది. ఆర్బీఐ మార్పులలో ప్రతి నెలా ఎలాంటి పరిమితి లేకుండా డిపాజిట్లు, రెన్యువల్ ఛార్జీలు లేకుండా ఉచిత ATM లేదా డెబిట్ కార్డ్ వినియోగం, ప్రతి సంవత్సరం కనీసం 25 పేజీల ఉచిత చెక్‌బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking), మొబైల్ బ్యాంకింగ్, పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ లాంటి నిర్ణయాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్‌లకు 7 రోజుల గడువు ఇచ్చింది. అప్పటిలోగా బ్యాంకులు BSBDలో మార్పులు చేయాలి.
ఉచిత విత్‌డ్రా లిమిట్ ఇప్పుడు ఎంత ?
బ్యాంకులు ప్రతి నెలా కనీసం 4 ఉచిత విత్‌డ్రాయల్‌లను అనుమతించాలి. ఇందులో వారి సొంత బ్యాంకు ATMలు, ఇతర బ్యాంకుల ATMల లావాదేవీలు ఉంటాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం, UPI, IMPS, NEFTతో పాటు RTGS వంటి డిజిటల్ చెల్లింపు లావాదేవీలను విత్‌డ్రాయల్‌గా పరిగణించరు. అంటే వినియోగదారుల నుండి ఈ డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జ్ చేయరు.
ప్రస్తుత BSBD ఖాతా హోల్డర్లు కొత్తగా ప్రారంభించిన ఫీచర్లు, సౌకర్యాలను కోరవచ్చు. అయితే రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా హోల్డర్లు తమ ఖాతాను BSBD ఖాతాగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే వారికి ఇప్పటికే మరే ఇతర బ్యాంకులో ఖాతా ఉండకూడదు.
ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే బ్యాంకులు వీటిని ముందే కూడా అమలు చేసే అవకాశాలున్నాయి. RBI తన రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ డైరెక్షన్స్, 2025ని అప్‌డేట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనివల్ల బ్యాంకులు అందించే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాల ఫ్రేమ్‌వర్క్ అధికారికంగా మారుతుంది.
ఆర్బీఐ కీలక నిర్ణయాలు
- నెలలో కనీసం 4 సార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
- కార్డ్ స్వైప్ (PoS), NEFT, RTGS, UPIతో పాటు IMPS వంటి డిజిటల్ చెల్లింపులు 4 సార్లు లిమిట్ కింద లెక్కించరు.
- సంవత్సరానికి కనీసం 25 పేజీల చెక్ బుక్, ఉచిత ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ కూడా లభిస్తుంది.
- ఎలాంటి వార్షిక రుసుము (Annual Charges) లేకుండానే బ్యాంకులు ఖాతాదారులకు ATM, డెబిట్ కార్డ్ ఇవ్వనున్నాయి.
మార్పుల లక్ష్యం ఏమిటి?
భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ఈ మార్పులను అమలు చేయడానికి ఉద్దేశ్యం ఏమిటంటే BSBD (సేవింగ్స్ అకౌంట్) ఖాతాలకు ప్రజలకు మరింత చేరువ చేయడం. తద్వారా ప్రజలు దాని ప్రయోజనాలు అర్థం చేసుకుంటారు. ఈ కొత్త నిబంధనలు లోకల్ ఏరియా బ్యాంక్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేమెంట్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు వర్తిస్తాయని ఆర్బీఐ అధికారులు తెలిపారు.
Also Read: RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు