Top Wealth Losers of 2023: 2023 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, భారత బిలియనీర్లు గౌతమ్ అదానీ (Gautam Adani), ముకేష్ అంబానీ (Mukesh Ambani) నికర విలువ చాలా వేగంగా తగ్గింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదలైనప్పటి నుంచి గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానం నుంచి 29వ స్థానానికి పడిపోయారు. ఈ నివేదిక వచ్చిన (2023 జనవరి 24న నివేదిక వచ్చింది) ఒక్క నెల రోజుల్లోనే అదానీ నికర విలువ (Gautam Adani Net Worth) 79 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కూడా (Mukesh Ambani Net Worth) ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు $ 5.93 బిలియన్ల నికర విలువను కోల్పోయారు.
అయితే, సంపద నష్టపోయిన బాధితులు వీళ్లిద్దరు మాత్రమే కాదు. మరో భారతీయ బిలియనీర్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు, డబ్బులు పోగొట్టుకోవడంలో రికార్డు సృష్టించారు. ఆయనే.. ప్రముఖ పెట్టుబడిదారు రాధాకిషన్ దమానీ (Radhakishan Damani). అదానీ - అంబానీ తర్వాత, 2023లో అత్యధికంగా నికర విలువను కోల్పోయిన మూడో భారతీయుడు ఈయన.
రాధాకిషన్ దమానీ ఎంత నికర విలువ కోల్పోయారు?
బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం, 2023లో ఇప్పటి వరకు, రాధాకిషన్ దమానీ నికర విలువ (Radhakishan Damani Net Worth) $ 2.61 బిలియన్లు లేదా 13 శాతం క్షీణించింది, $ 16.7 బిలియన్లకు తగ్గింది. 2023లో, బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్ 100 సంపన్నుల జాబితాలో రాధాకిషన్ దమానీ కూడా ఉన్నారు. ఆ జాబితాలో 98వ స్థానంలో ఉన్నారు.
రాధాకిషన్ దమానీ ఎవరు, ఏం చేస్తారు?
స్టాక్ మార్కెట్‌ను ఫాలో అయ్యేవారికి రాధాకిషన్ దమానీ లేదా RK దమానీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారత స్టాక్ మార్కెట్‌లో ఉన్న విజవంతమైన పెట్టుబడిదార్లలో ఆయన టాప్ లిస్ట్‌లో ఉన్నారు. దామానీని "మిస్టర్ వైట్ అండ్ వైట్" అని కూడా పిలిస్తారు. డీమార్ట్ బ్రాండ్‌తో రన్ అవుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌లో దమానీయే పెద్ద వాటాదారు. ఒకరకంగా చెప్పాలంటే డీమార్ట్ (D-Mart) ఓనర్ ఆయన.
1980లో, రాధాకిషన్ దమానీ మొదటిసారిగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించారు, ప్రారంభంలో చాలా నష్టపోయారు. నగదు పోయినా నాణ్యమైన అనుభవాన్ని గడించారు. ఆ తర్వాత క్రమంగా ఈక్విటీ మార్కెట్ లావేదేవీలపై పట్టు సాధించారు, ప్రముఖ పెట్టుబడిదారులలో ఒకరిగా నిలిచారు. 2002 సంవత్సరంలో, FMCG రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, ముంబై మొదటి -మార్ట్ స్టోర్‌ను ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఇప్పుడు, దేశవ్యాప్తంగా 200కు పైగా డి-మార్ట్ స్టోర్లు ఉన్నాయి.
అదానీ - అంబానీల నికర విలువ ఎంత?
బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముకేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు. ఈ సంవత్సరం ముకేష్ నికర విలువ $ 5.93 బిలియన్లు తగ్గి $ 81.2 బిలియన్లకు చేరుకుంది. ఈ ఏడాది గౌతమ్ అదానీ సంపదలోనూ భారీ అడ్డకోత కనిపించింది. ఆయన సంపద 79 బిలియన్ డాలర్ల నుంచి 41.5 బిలియన్ డాలర్లకు తగ్గింది.