Quick commerce firms to drop 10 minute delivery branding: ఉప్పు, పప్పులు కావాలంటే పది నిమిషాల్లో తెచ్చి ఇస్తామని క్విక్ కామర్స్ కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఈ ప్రచారంపై చాలా కాలంగా ఆందోళన ఉంది. దీన్ని కేంద్రం గుర్తించింది. డెలివరీ బాయ్‌ల భద్రత , పనితీరుపై పెరుగుతున్న ఆందోళనల  కార క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తమ  10 నిమిషాల డెలివరీ నినాదాన్ని ,  బ్రాండింగ్‌ను నిలిపివేయాలని కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అతి తక్కువ సమయంలో డెలివరీ చేయాలనే ఒత్తిడి వల్ల డెలివరీ ఏజెంట్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీనివల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

Continues below advertisement

గత నెల రోజులుగా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ ,  జెప్టో వంటి ప్రధాన సంస్థల ప్రతినిధులతో కేంద్ర మంత్రి పలుమార్లు సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం, డెలివరీ భాగస్వాములపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా తమ యాప్‌లు, ప్రచార కార్యక్రమాల నుండి 10 నిమిషాల డెలివరీ అనే క్లెయిమ్‌ను తొలగించేందుకు పలు సంస్థలు అంగీకరించాయి. ఇప్పటికే బ్లింకిట్ సంస్థ తన బ్రాండ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ నినాదాన్ని తొలగించినట్లు తెలుస్తోంది.                         

గతేడాది డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా గిగ్ కార్మికులు నిర్వహించిన నిరసనల తర్వాత ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు ,  హైదరాబాద్ వంటి నగరాల్లో సుమారు 2 లక్షల మందికి పైగా డెలివరీ ఏజెంట్లు భద్రత లేని డెలివరీ పోకడలకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. డెలివరీ భాగస్వాములకు మెరుగైన పని వాతావరణాన్ని కల్పించడం ,  వారి సామాజిక భద్రతను నిర్ధారించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.   ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. 

ప్రభుత్వ సూచనల మేరకు, ఈ సంస్థలు తమ డెలివరీ సమయాలను పునఃసమీక్షించనున్నాయి. కేవలం వేగం కంటే భద్రతకే ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలను మార్చుకుంటామని అగ్రిగేటర్లు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. గిగ్ కార్మికుల హక్కులను కాపాడుతూనే, వ్యాపార కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూడాలని ప్రభుత్వం ఈ క్విక్ కామర్స్ సంస్థలకు దిశానిర్దేశం చేసింది.