SBI Hiring: దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన ఐటీ సేవల అవసరాలతో పాటు ఇతర ఖాళీలకు పెద్ద మెుత్తంలో ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు కంపెనీ ఛైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. వీరికి బ్యాంకింగ్ వ్యవస్థలో అవగాహన కల్పించిన తర్వాత కొందరిని అసోసియేట్ రోల్స్ లోకి పంపనున్నట్లు వెల్లడించారు.
కంపెనీ ప్రస్తుతం 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను నియమించుకునే పనిలో ఉన్నట్లు వెల్లడించింది. వీరు సాధారణ ఉద్యోగులని కానీ మా అసోసియేట్ స్థాయిలో, అధికారుల స్థాయిలో దాదాపు 85 శాతం మంది ఇంజనీర్లు ఉండే వ్యవస్థను కలిగి ఉన్నట్లు ఖారా వెల్లడించారు. వారికి బ్యాంకింగ్ వ్యవస్థపై కొంత ఎక్స్‌పోజర్ ఇచ్చిన తర్వాత వివిధ అసోసియేట్ పాత్రలలోకి మార్చడం ప్రారంభిస్తామని, మరికొందరిని ఐటీలోకి ఛానెల్ చేయబడతారని చెప్పారు. 2023లో మెుత్తం ఎస్బీఐ ఉద్యోగుల సంఖ్య 2,35,858 నుంచి 2024లో 2,32,296కి పడిపోయింది.
సాంకేతిక నైపుణ్యాల కోసం కొత్త ఉద్యోగులను కూడా బ్యాంకు ప్రత్యేకంగా తీసుకోవాలనుకుంటున్నామన్న ఖారా.. తాము ఆలస్యంగా ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. దీనికి ముందు బ్యాంక్ మే9న తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో మార్కెట్ అంచనాలను అధిగమించి రూ.20,698 కోట్లుగా నమోదైంది. వాస్తవానికి బలమైన రుణ వృద్ధి రేటు ఉత్తమపనితీరుకు కారణంగా బ్యాంక్ పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంలో మార్చి త్రైమాసిక లాభం రూ.16,695 కోట్లుగా ఉంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లుగా నమోదైంది.
మార్చితో ముగిసిన ఫలితాల్లో బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. ఇదే క్రమంలో జనవరి-మార్చి మధ్య కాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1.28 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో ప్రొవిజన్స్ సగానికి తగ్గి రూ.1,609 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ప్రొవిజన్స్ రూ.3,315 కోట్లుగా ఉన్నాయి.
వాస్తవానికి బ్యాంక్ భారీ ఐటీ నిపుణుల రిక్రూట్మెంట్ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షల తర్వాత వచ్చింది. బ్యాంక్ ఐటీ విభాగాల్లో నాణ్యత ఉండాల్సిన స్థాయిల్లో లేకపోవటంపై రిజర్వు బ్యాంక్ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన కోటక్ బ్యాంక్ కొత్తగా 400 మంది టెక్ నిపుణులను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. వీరిని ఈ ఏడాదిలో ఆన్ బోర్డ్ చేసి సేవలను మెరుగుపరచాలని బ్యాంక్ చూస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ గా అవతరించిన స్టేట్ బ్యాంక్ పనితీరు విఫలాన్ని నిరోధించేందుకు ముందస్తుగానే అవసరమైన స్థాయిలో టెక్ నిపుణులను ఎస్బీఐ నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది.