Post office small savings: బ్యాంకుల కంటే పోస్టాఫీసు పొదుపు పథకాల ద్వారా ఎక్కువ వడ్డీ సంపాదించొచ్చు. కాబట్టి, తపాలా కార్యాలయాల గడప తొక్కేవారి సంఖ్య పెరుగుతోంది. ఉన్న పథకాలు నవీకరించుకోవడానికి, కొత్త పథకాలు తీసుకోవడానికి, ఖాతాల్లో నగదు నిల్వలు తెలుసుకోవడానికి, వివరాలు సరి చేయించుకోవడానికి.. ఇలాంటి రకరకాల పనుల కోసం వెళ్లేవాళ్లతో పోస్టాఫీసుల్లో రద్దీ పెరిగింది. దీనివల్ల ఖాతాదారులు విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అటు, పోస్టాఫీసు సిబ్బంది మీదా పని ఒత్తిడి పెరిగింది.  


ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లు, ఒక్క పనితో రెండు వర్గాలకూ పరిష్కారం చూపింది పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌. పోస్టాఫీసులో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ పరిష్కారం ఒక శుభవార్త. 


పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ (POSA) వంటి పథకాలకు సంబంధించి బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్‌, ఫుల్‌ స్టేట్‌మెంట్‌, మరికొన్ని చిన్నపాటి అవసరాల కోసం ఇకపై పోస్టాఫీసును వెదుక్కుంటూ వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌ ద్వారా, ఇంట్లో కూర్చునే ఇవన్నీ చూసుకోవచ్చు. ఇందుకోసం, ఈ-పాస్‌బుక్‌ సదుపాయాన్ని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ తీసుకొచ్చింది. ఈ సదుపాయాన్ని ఇప్పటికే కోట్లాది మంది ఉపయోగించుకుంటున్నారు. 


ఆయా పొదుపు ఖాతాలకు అనుసంధానించిన మొబైల్‌ ఫోన్‌ మీ చేతిలో ఉంటే చాలు, ఈ సదుపాయం పొందొచ్చు. ఏ యాప్‌నీ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నందుకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఇది పూర్తిగా ఉచితం.


ఈ-పాస్‌బుక్‌ ఇలా పొందండి
ఈ-పాస్‌బుక్‌ ఫెలిలిటీ కోసం పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారిక వెబ్‌సైట్లు www.indiapost.gov.in లేదా www.ippbonline.com హోమ్‌ పేజ్‌లోకి వెళ్లాలి. లేదా, https://posbseva.ippbonline.com/indiapost/signin లింక్‌ను అడ్రస్‌ బార్‌లో ఎంటర్‌ చేసినా నేరుగా వెబ్‌పేజ్‌లోకి మీరు వెళతారు. ఈ పేజీలో, మీకు  ఈ-పాస్‌బుక్‌ లింక్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ అడుగుతుంది. మొదట రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను, ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు OTP (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. దీని కాల పరిమితి 10 నిమిషాలే ఉంటుంది. ఆ గడువులోగా OTP బాక్స్‌లో ఆ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఇక్కడితో మీ వ్యక్తిగత ధృవీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక ఇప్పుడు మీకు కావాల్సిన పథకాన్ని ఎంచుకుని, అకౌంట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఇప్పుడు మీ ఖాతాకు సంబంధించిన వివరాలన్నీ మీ కళ్ల ఎదుట ప్రత్యక్షమవుతాయి. పోస్టాఫీస్‌కు వెళ్లే పని లేకుండా మినీ స్టేట్‌మెంట్‌, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, ఫుల్‌స్టేట్‌మెంట్‌ తెలుసుకోవచ్చు. వీటన్నింటినీ PDF ఫార్మాట్‌లోనూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ-పాస్‌బుక్‌ ఫెసిలిటీతో అన్ని జాతీయ పొదుపు పథకాల అకౌంట్‌ బ్యాలెన్సులు చెక్‌ చేసుకోవచ్చు.


మొబైల్‌ నంబర్‌ లేకుంటే?
ఒకవేళ మీ ఖాతాకు, మీ మొబైల్‌ నంబర్‌ను అనుసంధానించకపోతే ఎర్రర్‌ మెసేజ్‌ వస్తుంది. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఉంటేనే మీకు ఈ-పాస్‌బుక్‌ ఫెలిలిటీ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి, వెంటనే మీ పొదుపు ఖాతాకు మీ మొబైల్‌ నంబర్‌ను లింక్‌ చేయండి.