Income Tax Return: 2022-23 ఆర్థిక సంవత్సరం/2023-24 మదింపు సంవత్సరానికి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఈ ఏడాది జులై 31 (31 జులై 2023) వరకు సమయం ఉంది. ఈ గడువులోగా ఆదాయాన్ని ప్రకటించలేకపోయిన వాళ్లు, ఆ తర్వాత జరిమానాతో ITR ఫైల్ చేయవచ్చు. లాస్ట్‌ డేట్‌ వరకు వెయిట్‌ చేయకుండా, ముందుగానే మీ రిటర్న్‌ సమర్పించడం బెటర్‌. లాస్ట్‌ మినిట్‌లో హైరానా పడడం వల్ల అనవసర తప్పిదాలు చేసే ఆస్కారం ఉంటుంది. మీరు ITR ఫైల్ చేయడానికి సిద్ధం అవుతుంటే, ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా, AIS - ఫామ్‌ 26AS మధ్య తేడా తెలుసుకోవాలి. దీనివల్ల మీ పని మరింత ఈజీగా మారుతుంది.


AIS అంటే ఏంటి?
IT డిపార్ట్‌మెంట్, 2021లో, కంప్లైయెన్స్ పోర్టల్‌లో యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను (AIS) ప్రారంభించింది. టాక్స్‌ పేయర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఆర్థిక లావాదేవీల గురించిన సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఒకవేళ మీరు ఏ ఇన్ఫర్మేషన్‌ మార్చిపోయినా, ఈ స్టేట్‌మెంట్‌ గుర్తు చేస్తుంది.


AISలో ఎలాంటి సమాచారం ఉంటుంది?
టాక్స్‌ రిఫండ్‌, TDS లేదా TCS, వివిధ పెట్టుబడులపై వచ్చిన వడ్డీ, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, షేర్ లావాదేవీల వంటి చాలా అంశాలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన ఆదాయాలు AISలో కనిపిస్తాయి. మీ ITR ఫైలింగ్‌ టైమ్‌లో AISను పక్కన పెట్టుకుంటే, ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ మిస్‌ కాదు. AIS డేటాను PDF, JSON, CSV ఫార్మాట్లలో యాక్సెస్ చేయవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ఫామ్‌ 26AS అంటే ఏంటి?
ఒక ఫైనాన్షియల్‌ ఇయర్‌లో పన్ను మినహాయింపు, వసూళ్లు, పాన్ గురించిన పూర్తి సమాచారం ఉంది. ITR ఫైల్ చేసేటప్పుడు, 26AS ఫారం, పాన్‌తో పాటు ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల వివరాలు పన్ను చెల్లింపుదారు దగ్గర ఉండాలి.


26ASలో ఎలాంటి సమాచారం ఉంటుంది?
ఫామ్‌ 26ASలో, TDS, సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్, అడ్వాన్స్‌ టాక్స్‌, టాక్స్‌ రిఫండ్‌, యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌, హై వాల్యూ ట్రాన్జాక్షన్లు, టాక్స్‌ డిడక్షన్‌ వంటి సమాచారం ఉంటుంది.


AISని ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
AIS డేటా కోసం, ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌ https://www.incometax.gov.in/iec/foportal/ లో మీ యూజర్‌ ఐడీ (పాన్‌ నంబర్‌), పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్ కావాలి. ఆ తర్వాత, మెనూలో కనిపించే AIS మీద క్లిక్‌ చేయండి. మిమ్మల్ని మరొక పేజీలోకి రీడెరెక్ట్‌ చేయడానికి పర్మిషన్‌ అడుగుతుంది. మీరు ప్రొసీడ్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇప్పుడు మరొక పేజీలో AIS ఓపెన్‌ అవుతుంది. అక్కడ, AIS మీద క్లిక్‌ చేయండి. ఇప్పుడు, మీకు కావలసిన ఫైనాన్షియల్‌ ఇయర్‌ను ఎంచుకుని, యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ చూడడానికి AIS బాక్స్‌లో క్లిక్ చేయండి. ఆ రిపోర్ట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో, పార్ట్‌-Aలో మీ పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌, పార్ట్‌-Bలో మీ లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ఫామ్‌ 26AS ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌ https://www.incometax.gov.in/iec/foportal/ లోకి లాగిన్ అవ్వండి. మెనూలో కనిపించే ఈ-ఫైల్ మీదకు కర్సర్‌ తీసుకెళ్లగానే డ్రాప్‌ డౌన్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఎంచుకోండి. అందులో 'వ్యూ ఫారం 26AS'పై క్లిక్ చేయండి. ఆ తర్వాత బాక్స్‌లో కన్ఫర్మ్‌ బటన్‌ నొక్కండి. మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ కనిపించే బాక్స్‌లో టిక్‌ చేసి, ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయండి. ఇక్కడ,  View Tax Credit (Form 26AS/Annual Tax Statement) కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేయండి. ఆ తర్వాత అసెస్‌మెంట్‌ ఇయర్‌ ఎంచుకోండి. View As బాక్స్‌లో HTML సెలెక్ట్‌ చేయండి. ఫాం 26AS ఓపెన్‌ అవుతుంది. దానిని డౌన్‌లోడ్ చేయండి.


మరో ఆసక్తికర కథనం: 3 నెలల కనిష్టంలో పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial