Mahila Samman Savings:


మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (MSSC) స్కీమ్‌కు ఊహించని స్పందన లభిస్తోంది! దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలు ఈ పథకంలో చేరుతున్నారు. లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ చెల్లిస్తుండటం, కాల పరిమితి రెండేళ్లే ఉండటం, మూలం వద్ద పన్ను కత్తించకపోవడం వంటివి అందరినీ ఆకర్షిస్తున్నాయి. కొందరు పురుషులు సైతం గార్డియన్‌గా ఉంటూ తమ చిన్నారుల పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు.


ఊహించని స్పందన


మొదట్లో మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌ను (MSSC) పోస్టాఫీసుల్లోనే మొదలు పెట్టారు. ఆరంభం నుంచే దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో మహిళలు ఖాతాలు తెరిచారు. ఇప్పుడీ పథకాన్ని మరో మూడు బ్యాంకులకు విస్తరించారు. బ్యాంక్‌ ఆఫ్ బరోడా (Bank of Baroda), కెనరా బ్యాంకు (Canara Bank), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో (Bank of India) ఖాతాలు తెరిచే సౌకర్యం కల్పించారు. మున్ముందు మరిన్ని బ్యాంకులకు విస్తరించే అవకాశం లేకపోలేదు.


మొదట పోస్టాఫీసులోనే


ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌ను ప్రకటించారు. మహిళల కోసమే ప్రత్యేకంగా దీనిని తీసుకొస్తున్నామని తెలిపారు. 7.5 శాతం వడ్డీ ఇస్తామని, కేవలం రెండేళ్ల కాలపరిమితోనే మంచి రాబడి పొందొచ్చని వివరించారు. అర్హత పొందిన ప్రైవేటు, పబ్లిక్‌ బ్యాంకుల్లో ఖాతాలో తెరవొచ్చని వెల్లడించారు. మొదట కేవలం పోస్టాఫీసుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మూడు బ్యాంకులకు పెంచారు. బడ్జెట్‌ లోటు, ద్రవ్యలోటును పూడ్చేందుకే ప్రభుత్వం ఈ స్కీమ్‌ తీసుకొచ్చినట్టు తెలిసింది.


బ్యాంకులకు విస్తరణ


మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్ 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు కొనసాగుతుంది. పోస్టాఫీసులో ఈ ఖాతా తెరవడం సులువే. ఆధార్‌, పాన్‌ కార్డు వంటి కేవైసీ పత్రాలు సమర్పించి ఖాతా తీసుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో కస్టమర్లు, నాన్‌ కస్టమర్లూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంఎస్‌ఎస్‌సీ స్కీమ్‌ సేవలను అందిస్తున్నందుకు గర్వంగా ఉందని కెనరా బ్యాంకు ప్రకటించింది. బ్యాంకింగ్‌ సెక్టార్లో మొదట బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకే అనుమతి ఇచ్చారు. 


పరిమితి మించకుండా ఎన్ని సార్లైనా!


మహిళా సమ్మాన్ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌లో రెండేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. వెయ్యి రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్‌ చేయొచ్చు. ఈ డబ్బును ఏకమొత్తంగా జమ చేయాలి. విడతల వారీగా కుదరదు. ఈ స్కీమ్‌ కింద సింగిల్‌ అంకౌంట్‌ మాత్రమే తెరవగలరు. జాయింట్‌ అకౌంట్‌కు వీలు లేదు. అయితే మూడు నెలల వ్యవధిలో ఎన్ని డిపాజిట్లైనా చేయొచ్చు. కానీ పరిమితి రూ.2 లక్షలకు మించొద్దు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌ స్కీమ్‌పై 7.5 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. ఈ వడ్డీని మూడు నెలలకు ఒకసారి ఖాతాలో డిపాజిట్‌ చేస్తారు. 


పాక్షికంగా  విత్‌డ్రా


ఈ పథకంలో పెట్టుబడి పెడితే సంవత్సరానికి 7.5% వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్‌కు వెళ్లి ఫామ్‌-1 నింపి అకౌంట్‌ తీయాలి. మెచ్యూరిటీ సమయంలో మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఫామ్‌-2 నింపాలి. మెచ్యూరిటీ వ్యవధికి ముందు, అంటే రెండేళ్లు పూర్తి కాకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత కొంత మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. అయితే ఖాతాలో జమ చేసిన మొత్తంలో 40 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.


Also Read: రిస్క్‌ లేని ఇన్వెస్ట్‌మెంట్‌ + రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ - ఈ స్కీమ్స్‌ ట్రై చేయొచ్చు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial