SEBI Launches New Digital Platform MITRA: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (Securities and Exchange Board of India), కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'మిత్ర'ను ప్రారంభించింది. ఇది మార్కెట్ ఇన్వెస్టర్లకు సాయం చేస్తుంది. మిత్ర సాయంతో, పెట్టుబడిదారులు, తమ నిష్క్రియాత్మక మ్యూచువల్ ఫండ్స్ (Inactive Mutual Funds) లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్స్ (Unclaimed Mutual Funds) ఫోలియోలను గుర్తించగలరు.
మిత్ర (MITRA) పూర్తి పేరు 'మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్'. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి, పెట్టుబడిదారులు, తాము మరచిపోయిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను సులభంగా కనిపెట్టగలరు. అంతేకాదు, ఈ వేదిక ద్వారా, పెట్టుబడిదారులు తమ KYCని సకాలంలో అప్‌డేట్ చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై నిఘా
పెట్టుబడిదారులు, కాలక్రమేణా తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నారనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను మిత్ర పరిష్కరిస్తుందని సెబీ తన సర్క్యులర్‌లో తెలిపింది. కొంతమంది ఖాతాదార్లు, తమ సంప్రదించగల సమాచారాన్ని అప్‌డేట్ చేయకపోవడం లేదా సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల, వారి పేరు మీద పెట్టిన పెట్టుబడులు క్రమంగా మరుగునపడుతున్నాయి. అంతేకాదు, కొంత మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మధ్యలో ఆపేసి, ఆ తర్వాత వాటి గురించి మరిచిపోతున్నారు. ఎప్పుడో చాలా కాలం తర్వాత వాటిని గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా అవి వాళ్లకు గుర్తుండడం లేదు. లేదా, పెట్టుబడుల గురించి గుర్తుకొచ్చాక ఆన్‌లైన్‌లో సరైన సమాచారాన్ని నమోదు చేయకపోవడం వల్ల కూడా అవి వెలుగులోకి రావడం లేదు.
పెట్టుబడిదారులకు సాధికారత
ఏళ్ల తరబడి ఇలా క్రియారహితంగా మారిన ఫోలియోలు చాలా బలహీనంగా ఉంటాయని & మోసాలకు ఆస్కారం కల్పిస్తాయని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి మిత్రను సెబీ పరిచయం చేసింది. ఇది, పరిశ్రమ స్థాయిలో నిష్క్రియాత్మక & క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను కనిపెట్టేలా పెట్టుబడిదారులకు డేటాబేస్ అందిస్తుంది. తద్వారా, పెట్టుబడిదారులకు సాధికారత కల్పిస్తుంది. RTA ద్వారా MITRA ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చేసినట్లు SEBI తెలిపింది.
సెబీ సర్క్యులర్ ప్రకారం, MITRA సాయంతో, తాము మరిచిపోయిన ఫోలియోలను మాత్రమే కాదు, తమ కుటుంబ సభ్యులు చేసిన పెట్టుబడులను సైతం ప్రజలు గుర్తించగలరు. ఆ పెట్టుబడులకు చట్టపరమైన హక్కుదారులుగా నిరూపించుకుని వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్, పెట్టుబడిదారులు తమ KYCని ప్రస్తుత నిబంధనల ప్రకారం అప్‌డేట్ చేసేలా ప్రోత్సహిస్తుంది & KYCతో లింక్ కాని ఫోలియోల సంఖ్యను తగ్గిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: 622 పేజీలు, 3.35 లక్షల పదాలతో కొత్త ఆదాయ పన్ను బిల్లు - మీరు కూడా ఈజీగా అర్ధం చేసుకోవచ్చు!