SBI WhatsApp Banking: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. తాజాగా వాట్సాప్‌ బ్యాంకింగ్‌ను (SBI WhatsAPP Banking Services) ఆరంభించింది. ఇకపై కస్టమర్లు ఖాతా నగదు వివరాలు, మినీ స్టేట్‌మెంట్‌ను వాట్సాప్‌ ద్వారా పొందొచ్చు. 'మీ బ్యాంకు ఇప్పుడు వాట్సాప్‌లోనూ సేవలందిస్తోంది. మీ అకౌంట్‌ బ్యాలెన్స్‌, మినీ స్టేట్‌మెంట్‌ను వెంటనే చూసేయండి' అని బుధవారం ట్వీట్‌ చేసింది.




నమోదు ప్రక్రియ


ఎస్‌బీఐ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ ద్వారా సేవలు పొందాలంటే మొదట మీ వివరాలను నమోదు చేసుకోవాలి. 'WAREG' అని టైప్‌చేసి స్పేస్‌ ఇచ్చి మీ అకౌంట్ నంబర్‌ను 7208933148కు ఎస్‌ఎంఎస్‌ పంపించాలి. మీ ఎస్‌బీఐ ఖాతాకు అనుసంధానం చేసిన మొబైల్‌ నంబర్‌నే ఇందుకు ఉపయోగించాలి.


90226 90226కు సందేశం


ఎస్‌బీఐ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవల కోసం నమోదు చేసుకున్న తర్వాత ఎస్‌బీఐ నంబర్‌ 90226 90226 నుంచి మీకు ఓ సందేశం వస్తుంది. ఈ నంబర్‌ను మీరు ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.


వాట్సాప్‌ సేవలు


ఆ తర్వాత 'Hi SBI' అని 90226 90226కు సందేశం పంపించండి. లేదా ఇప్పటికే మీకు వచ్చిన సందేశానికి బదులివ్వండి. అప్పుడు మీకు ఈ కింది విధంగా సమాచారం వస్తుంది.
 
ప్రియమైన వినియోగదారుడా, ఎస్‌బీఐ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలకు స్వాగతం! ఈ దిగువన ఇచ్చిన ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోండి.
1. అకౌంట్‌ బ్యాలెన్స్‌
2. మినీ స్టేట్‌మెంట్‌
3. వాట్సాప్‌ బ్యాంకింగ్‌ నుంచి వైదొలగండి


మీరు '1' అని పంపిస్తే బ్యాంకు బ్యాలెన్స్‌, '2' అని పంపిస్తే మినీ స్టేట్‌మెంట్‌ వస్తుంది. ఒకవేళ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలు అవసరం లేదనుకుంటే 3 టైప్‌ చేసి వైదొలగొచ్చు.



క్రెడిట్‌ కార్డు కస్టమర్లకూ


క్రెడిట్ కార్డు కస్టమర్లకూ ఎస్‌బీఐ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తోంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వినియోగదారులు అకౌంట్‌ ఓవర్‌వ్యూ, రివార్డు పాయింట్లు, చెల్లించాల్సిన బ్యాలెన్స్‌ ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేవలకు నమోదు చేసుకోవాలంటే 'OPTIN' అనే సందేశాన్ని 9004022022కు పంపించాలి. మీ రిజిస్టర్డు మొబైల్‌ నంబర్‌ నుంచి 08080945040 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా సరిపోతుంది.